‘రిపబ్లిక్’ మూవీ చూసిన సాయితేజ్!

సాయితేజ్ నటించిన తాజా చిత్రం ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి కానుకగా, అక్టోబర్ 1న థియేటర్లలో విడుదలైంది. దేవ కట్టా దర్శకత్వంలో భగవాన్, పుల్లారావు నిర్మించిన ఈ సినిమా విమర్శకులు, మేధావుల ప్రశంసలు పొందింది. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడంలో న్యాయస్థానాల పాత్ర ఎంతో ఉందని ఈ సినిమా ద్వారా దేవ కట్టా తెలిపారు.

రాజకీయ నాయకుల కనుసన్నలలో ప్రభుత్వ అధికారులు మసలినంత కాలం ఈ వ్యవస్థ బాగుపడదనే విషయాన్ని నిర్మొహమాటంగా చూపారు. దారితప్పిన ప్రజాస్వామ్యాన్ని ఓ యువ ఐఎఎస్ అధికారి ఎలా గాడిలో పెట్టాడు, దాని పర్యవసానం ఏమిటీ? అనే అంశాలను హృదయానికి హత్తుకునేలా దేవ కట్ట ‘రిపబ్లిక్’లో చూపించారు. అయితే ఈ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయితేజ్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనలేక పోయారు. సినిమా విడుదలైన తర్వాత కూడా దానిని చూడలేదు. శుక్రవారం ఈ సినిమా జీ 5లో స్ట్రీమింగ్ కావడంతో తన టీమ్ తో కలిసి ఆయన ఇంట్లోనే ‘రిపబ్లిక్’ను చూశారు. ‘పంజా అభిరామ్ పాత్ర పోషించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, అలానే జీ 5లోనూ ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తున్న వీక్షకులకు కృతజ్ఞతలు’ అని సాయితేజ్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు.

Related Articles

Latest Articles