రివ్యూ : ‘రౌడీ బాయ్స్’

ఓ కొత్త హీరో జ‌నం ముందు నిల‌వాలంటే, ఖ‌చ్చితంగా అంత‌కు ముందు కొంత‌యినా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి తీరాలి. ఇక సినిమా రంగంతోనే అనుబంధం ఉన్న వారి కుటుంబాల నుండి వ‌చ్చే హీరోల‌కు వారి పెద్ద‌ల నేప‌థ్యమే పెద్ద అండ‌. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, స‌మీప‌బంధువు, భాగ‌స్వామి శిరీష్ త‌న‌యుడు ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్తో హీరోగా జ‌నం ముందుకు వ‌చ్చాడు. సంక్రాంతి సంబ‌రాల్లోనే రౌడీ బాయ్స్ రావ‌డం వ‌ల్ల కొత్త హీరోల‌కు సైతం కొంత గుర్తింపు ల‌భించ‌క మాన‌దు. పైగా ఈ సారి సంక్రాంతికి నాగార్జున బంగార్రాజు మిన‌హాయిస్తే అన్నీ అప్ క‌మింగ్ హీరోస్ సినిమాలే. అందులో న‌ట‌శేఖ‌ర కృష్ణ మ‌న‌వ‌డు గ‌ల్లా అశోక్ హీరో కూడా ఉంది. దాంతో జ‌నానికి మంచి విందు. ఎందుకంటే కొత్త‌వారిని కంపేర్ చేస్తూ కాల‌క్షేపం చేయ‌డానికి ఈ పండ‌గ సీజ‌న్ ప‌నికొస్తుంది. ఆ విధంగా ఈ యువ‌హీరోల‌కు ఈ సంక్రాంతి భ‌లేగా క‌ల‌సి వ‌చ్చిన‌ట్టే. ఇక రౌడీ బాయ్స్తో ఆశిష్ కు కూడా అదే తీరున వెల్ క‌మ్ ల‌భించ‌క మాన‌దు.

రౌడీ బాయ్స్ ఏం చేస్తారంటే – ష‌రా మామూలే కొట్టుకుంటారు. అదే ఈ సినిమాలోనూ క‌నిపిస్తుంది. హీరో చదివేది ఇంజనీరింగ్ కాలేజ్, హీరోయిన్ చదివేది మెడికల్ కాలేజ్. ఎదురు బొదురుగా ఉండే ఈ రెండు కాలేజీల విద్యార్థుల మధ్య జరిగే రచ్చే ఈ సినిమా. హీరోని ప్రేమించిన హీరోయిన్ సినిమా సగంలో అతనితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ మొదలు పెడుతుంది. అయితే ఒకే గూడు కిందకు ఈ ప్రేమపక్షుల చేరడం వల్ల వారికి ఎలాంటి సమస్యలు వచ్చాయి? తనను నమ్ముకుని వచ్చిన హీరోయిన్ ను హీరో ఎందుకు ఇంటి నుండి పంపేశాడు? ‘హూ ఆర్ యూ?’ అని హీరోయిన్ అడిగే ప్రశ్నకు హీరో కు సమాధానం దొరికిందా లేదా? అనేదే ఈ సినిమా.

గతంలో ఆర్ట్స్ కాలేజ్, సైన్స్ కాలేజీ స్టూడెంట్స్ మధ్య గొడవలు మనం చూశాం. అలానే మొదట్లో గొడవ పడి ఆ తర్వాత ప్రేమికులుగా మారే అబ్బాయిల, అమ్మాయిల కథలూ చాలానే వచ్చాయి. ఇక మెడికో అయినా హీరోయిన్ ను వెతుక్కుంటూ హీరో చేసే ప్రయాణం, రాక్ స్టార్ కావాలనుకునే హీరో లక్ష్యం నెరవేరడం ఇవన్నీ గతంలో ఎన్నో సినిమాలలో చూసిన సంఘటనలే. అయితే ఇందులో హీరో ఆశిష్ దిల్ రాజు ఫ్యామిలీ నుండి వచ్చిన కుర్రాడు కాబట్టి కాస్తంత భారీగా తీశారు.

ఆశిష్ తొలి చిత్ర‌మే అయినా, అత‌ని నుండి త‌గిన న‌టన రాబ‌ట్ట‌డానికి ద‌ర్శ‌కుడు, ‘హుషారు’ ఫేమ్ శ్రీ‌హ‌ర్ష కొనుగంటి త‌గిన కృషి చేశాడు. ఓ కొత్త హీరోను ప‌రిచ‌యంచేసే స‌మ‌యంలో కావ‌ల‌సిన అంశాల‌న్నిటికీ ఎంతో ప్రాధాన్య‌మిచ్చాడు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆశిష్ సైతం న‌ట‌న‌లోనే కాకుండా, డాన్సులు, ఫైట్స్ లో త‌న మార్కు చూపించాడు. ఇక అందాల అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ను చూడ‌గానే మ‌న ప‌క్కింటి అమ్మాయి అనే ఫీలింగ్ క‌లుగుతుంది. ఇందులో మెడికోగా అనుప‌మ అభిన‌యం ఆక‌ట్టుకుంది. కాకపోతే కథానుగుణంగానే కొన్ని చోట్ల లిమిటేషన్స్ క్రాస్ చేసి లిప్ లాక్ సీన్స్ కు అనుపమ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించిన స‌హిదేవ్ విక్ర‌మ్ ప్ర‌ముఖ నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ త‌న‌యుడు. గ‌తంలో అత‌నికి న‌ట‌నానుభ‌వం ఉంది. ఇందులో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో ఇట్టే ఆక‌ట్టుకున్నాడు. ముఖ్యంగా అత‌ను న‌వ్వుతోనే విల‌నీ పండించే ప్ర‌య‌త్నం చేశాడు. మిగిలిన పాత్ర‌ల్లో జయప్రకాశ్‌, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తిక్ ర‌త్నం, కోమ‌లీ ప్ర‌సాద్ తదితరులు త‌మ పాత్ర‌ల‌కు త‌గ్గ అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు.

ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఎక్క‌డా ఖ‌ర్చుకు వెనుకాడలేదు. దిల్ రాజుకు గ‌తంలో ప‌లు మ్యూజిక‌ల్ హిట్స్ అందించిన దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాలోనూ త‌న‌దైన బాణీలు వినిపించారు. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. అయితే కథ, కథనాలు రొటీన్ గా ఉండటం ‘రౌడీ బాయ్స్’ మెయిన్ డ్రాబ్యాక్!

ప్ల‌స్ పాయింట్స్:

  • యూత్ ను ఆక‌ట్టుకొనే అంశాలు
  • దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం

మైన‌స్ పాయింట్స్:

  • సినిమా చూస్తోంటే పాత క‌థ‌లు గుర్తుకురావ‌డం
  • పేల‌వ‌మైన క‌థ‌నం

రేటింగ్: 2.5 / 5

ట్యాగ్ లైన్ : రచ్చ రంబోల!

SUMMARY

Rowdy Boys is the love story of Akshay and Kavya in the backdrop of gang wars between students of Engineering and Medical college students.

Related Articles

Latest Articles