జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ చూపు.. ఆర్జేడీ నేతతో మంతనాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. థర్డ్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్‌, లెఫ్ట్ పార్టీల నేతలతో కేసీఆర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ప్రతినిధుల బృందం సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది.

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఆర్జేడీ ప్రతినిధుల బృందంలో మాజీ మంత్రి అబ్దుల్ భారీ సిద్దిఖీ జీ, ఎమ్మెల్సీ సునీల్ సింగ్‌, మాజీ ఎమ్మెల్యే భోలా యాద‌వ్ ఉన్నారు. ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ సీఎం నితీష్‌ కుమార్‌కు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ గట్టి పోటీ ఇచ్చారు. కాలం కలిసివస్తే తేజస్వీ యాదవ్ సీఎం అయ్యుండేవారు.

Related Articles

Latest Articles