నిర్మాత రాజ్ కందుకూరి తనయుడుగా చిత్ర రంగ ప్రవేశం చేసి ‘చూసి చూడంగానే’, ‘గమనం’ వంటి చిత్రాల్లో నటించాడు శివ కందుకూరి. నటుడుగా తానేమిటో నిరూపించుకోవాలనుకుంటున్న శివకు ‘మను చరిత్ర’ రూపంలో అవకాశం లభించింది. దానికి తగ్గట్లే ఈ సినిమా పాటలు బాగున్నాయన్న టాక్ రావటంతో సినిమాపై కొంత బజ్ ఏర్పడింది. మరి శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘మను చరిత్ర’ శివ కలను నిజం చేసిందా? లేదా అన్నది చూద్దాం.
ప్రేమను మర్చిపోవాడానికి ప్రేమే మందు అన్న కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం ‘మను చరిత్ర’. చదువులో టాపర్ అయిన మను జీవితంలో ప్రేమ చేసిన గాయం, దానిని మర్చిపోవడానికి తను చేసిన ప్రయత్నం, దానికి క్రైమ్, పొలిటికల్ యాంగిల్స్ మిక్స్ చేసి కథను తయారు చేశాడు దర్శకుడు భరత్ కుమార్. చదువుల్లో టాపర్ అయిన మను (శివ కందుకూరి) హీరోయిన్ మేఘా ఆకాశ్ తో ప్రేమలో పడతాడు. తను కూడా తనని ప్రేమిస్తుంది. స్నేహితుని (సుహాస్) ప్రేమకు సాయం చేయబోయి హీరోయిన్ అన్నలపై చేయి చేసుకోవడంతో మేఘాను వేరే వారికి ఇచ్చి పెళ్ళి చేస్తారు. ప్రేయసిని మర్చిపోలేక చెడు వ్యసనాలకు బానిసై ప్రేమకోసం పలువురిని ప్రేమ పేరుతో ప్రేమించి బ్రేకప్ చెబుతూఉంటాడు మను. ఈ నేపథ్యంలో డబ్బు అవసరాలకోసం రౌడీ షీటర్ రుద్ర(డాలీ ధనుంజయ్) గ్యాంగ్ లో చేరతాడు. మేయర్ (శ్రీకాంత్ అయ్యంగార్), రుద్ర మధ్య ఆధిపత్య పేరులో ఏం జరిగింది. మేఘాను మర్చిపోవటానికి ప్రియ వడ్లమానిని ప్రేమించిన శివకు తన ప్రేమ దక్కుతుందా? చివరకు ఏం జరిగిందన్నదే ఈ ‘మను చరిత్ర’.
వరంగల్ గూండాయిజం నేపథ్యంలో సాగే ఈ సినిమా కథలోని ప్రేమ కథాంశం చాలా వరకూ అర్జున్ రెడ్డిని తలపింప చేస్తుంది. దర్శకుడు భరత్ కుమార్ తను చెప్పదలచుకున్న అంశంలో తడబడ్డాడు. ప్రేమను మర్చిపోవడానకి ప్రేమే మందు అనే అంశం చుట్టూ రౌడీయిజం, గూండాయిజం ముడిపెట్టి రెండింటినీ బ్యాలెన్స్ చేయలేక కలగాపులంగా తీశాడు. శివ కందుకూరి ‘మను’ పాత్రకు న్యాయం చేసినా క్యారక్టరైజేషన్ సరిగ్గా లేకపోవడంతో నిస్సహాయుడుగా మిగిలిపోతాడు. మేఘా ఆకాశ్ పాత్రకి ప్రథమార్ధంలో ప్రాధాన్యమున్నా ద్వితీయార్థంలో ఒకరి రెండు సీన్లనే పరిమితం కావలసి వచ్చింది. ద్వితీయార్థంలో వచ్చే ప్రియా వడ్లమాని మాత్రం పరిధి చిన్నదైనా తన దైన ముద్ర వేయగలిగింది. తనకి తప్పక అవకాశాలు వస్తాయి. ప్రెండ్ గా సుహాస్, మధునందన్, రౌడీ షీటర్ రుద్రగా డాలీ ధనుంజయ్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ ప్రాణం పోసిందనే చెప్పాలి. పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. రాహుల్ ఫోటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ ప్రవీణ్ పూడి నిడివిని 20 నిమిషాల వరకూ తగ్గించి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కొత్త హీరోపై రాజీపడకుండా నారా శ్రీనివాసరెడ్డి ఖర్చుపెట్టినట్లు అనిపిస్తుంది. రాజ్ తరుణ్ ఒక్క సీన్ లో ఎందుకు నటించాడో తనకే తెలియాలి. అన్ని వనరులూ ఉన్నా సినిమాను జనరంజకంగా తీయలేక పోవడం దర్శకుడు గా భరత్ కుమార్ దే వైఫల్యం అని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్
నిర్మాణ విలువలు
గోపీసుందర్ సంగీతం
మైనస్ పాయింట్స్
ఆకట్టుకోని కథ, కథనం
అర్జున్ రెడ్డి కథాంశాన్ని పోలి ఉండటం
సినిమా నిడివి
రేటింగ్: 2.25/ 5
ట్యాగ్ లైన్: ప్రేమకు ప్రేమే మందు