వర్ష బాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష

భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో సచివాలయంలో వర్ష బాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సూచనలు చేశారు. ఈ సందర్భంగా వర్షాలపై సీఎంకు అధికారులు వివరాలు అందజేశారు. గతంలో వాయుగుండం కారణంగా భారీవర్షాలు కురిశాయని, ఇప్పుడు కూడా తీవ్ర వాయుగుండం కారణంగా కూడా భారీవర్షాలు కురుస్తున్నాయని, ప్రస్తుతం వాయుగుండం తమిళనాడులో తీరం దాటిందని అన్నారు.

ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో గత రాత్రి నుంచి వర్షం తగ్గుముఖం పట్టిందన్న సమాచారం వస్తోందని, చెరువులకు అక్కడక్కడా గండ్లు పడినట్టు సమాచారం వస్తోందని అన్నారు. ముంపు బాధితులను కూడా వెంటనే సహాయక కేంద్రాలకు తరలించామని అధికారులు వెల్లడించారు. వరదలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా తరలించే చర్యలు కూడా చేపట్టామని తెలిపారు. సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా రాజీలేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, ఆయా జిల్లాలకు అదనంగా నిధులు కూడా ఇచ్చామని సీఎం జగన్‌ అన్నారు. అయితే తిరుపతిలో భారీ వర్షాల కారణంగా స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రద్యుమ్నను నియమించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తిరుపతిలో వరదనీరు నిల్వ ఉండిపోవడానికి కారణాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. చెరువుల పూడ్చివేత వల్ల ఇది జరిగిందని అధికారులు తెలపడంతో దీని పై తగిన కార్యచరణ సిద్ధం చేయాలన్న సీఎం సూచించారు. అంతేకాకుండా బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలన్నారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని, ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందన్న సీఎం జగన్‌.. బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. వర్షాల తర్వాత కూడా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా నిలవాలని, రైళ్లు, విమానాలు రద్దైన నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండాలని జగన్‌ పేర్కొన్నారు.

Related Articles

Latest Articles