రేవంత్‌, కోమటి రెడ్డిమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి…!

ఈ రచ్చ ఇప్పటిది కాదు… రెండు నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. వివాదం కొలిక్కి వస్తుందనుకుంటే… మళ్లీ మొదటికొచ్చింది. టీ కాంగ్రెస్‌ లో జరుగుతున్న లేటెస్ట్ రచ్చకు కారణమేంటి?

తెలంగాణ కాంగ్రెస్ లో… ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి… పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిల మద్య ఒకప్పుడు మంచి మైత్రి ఉండేది. కానీ… రేవంత్ చీఫ్ అయ్యాక సీన్‌ మారింది. కోమటిరెడ్డి…రేవంత్ మద్య గ్యాప్ పెరిగింది. పిసిసి నియామక సమయంలో టీడీపీ నుండి వచ్చిన వాళ్ళు నా ఇంటికి ఎవరు రావద్దు అని కోమటిరెడ్డి ప్రకటన చేసినప్పటి నుండి… రావిర్యాల సభ వరకు..ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడిప్పుడే డ్యామేజ్ కంట్రోల్ కి పార్టీ కసరత్తు చేస్తోంది.

కానీ పరిస్థితి సద్దుమణగక ముందే, విజయమ్మ రూపంలో మళ్లీ వివాదానికి తెర లేచింది. పార్టీ నాయకులెవరూ వైఎస్ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళొద్దని పిసిసి చీఫ్ రేవంత్..సిఎల్పీ నేత భట్టి పేరుతో ప్రకటన వచ్చింది. కానీ కోమటిరెడ్డి సభకు వెళ్లారు. వెళ్ళే వరకు ఓకె… కానీ అక్కడ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మళ్లీ కాంగ్రెస్ లో కాక రేపుతున్నాయి.

మూడు రోజులుగా… విజయమ్మ ఫోన్ చేసి సభకు రావాలని ఆహ్వానం ఇస్తుంటే… చివరి రోజు ప్రకటన జారీ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు కోమటిరెడ్డి. తనకు ఫోన్ చేసి కూడా ఎవరు సమాచారం ఇవ్వలేదని కోమటిరెడ్డి తప్పుపడుతున్నారు. మూడు రోజులుగా పార్టీ నిద్రపోతోందా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు…వైఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన నేత అని, అయన సంతాప సభకు వెళ్తే తప్పేంటని ఎదురు దాడి చేశారు కోమటిరెడ్డి.

ఇంత వరకు కూడా బాగానే ఉంది కానీ… ఎమ్మెల్యే సీతక్క మీద చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీలో రచ్చ మొదలైంది. సీతక్కను విమర్శించే నెపంతో రేవంత్ ని కోమటిరెడ్డి టార్గెట్ చేశారనేది ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ ఎమ్మెల్యే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కాళ్ళు మొక్కితే తప్పు కానిది… కాంగ్రెస్ నాయకుడు వైఎస్ సంతాప సభకు వెళ్లడం తప్పెలా అవుతుందని కామెంట్ చేయడంతో రచ్చ మొదలైంది.

పార్టీ నిర్ణయం తీసుకున్నా…ఏఐసీసీ కూడా వైఎస్ సంస్మరణ సభకు ఎవరు వెళ్తున్నారనే పరిశీలిస్తోందనే అంశాన్ని కూడా లేవనెత్తారు పిసిసి చీఫ్‌. అయితే, కోమటిరెడ్డి ఆ సభకి వెళ్లడం అయన వ్యక్తిగతమే అయినా… అక్కడ పార్టీ మీద చేసిన వ్యాఖ్యలు ఎటు దారి తీయనున్నాయనేది అసలు ప్రశ్న.

కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అటు సీతక్క…ఇటు.. రేవంత్ కూడా అసహనంతో ఉన్నారని టాక్‌ నడుస్తోంది. కోమటిరెడ్డి చేస్తున్న వరుస కామెంట్స్ పై రేవంత్ శిబిరం గుర్రుగా ఉంది. కోమటిరెడ్డి, రేవంత్ మద్య గ్యాప్ తగ్గించాలని కొందరు పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆ ప్రయత్నం మొదలవక ముందే, కొత్త సమస్యలు వచ్చి…గ్యాప్ మరింత పెంచుతోంది. వైఎస్ సంస్మరణ సభ వద్ద కోమటిరెడ్డి వ్యాఖ్యల్ని పార్టీ అధిష్టానం ఎలా చూస్తుందనేది అసలు ప్రశ్న..!!

Related Articles

Latest Articles

-Advertisement-