టీఆర్ఎస్, బీజేపీని డిఫెన్స్ లో పడేసే రేవంత్ రెడ్డి ప్లాన్

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం అయిన తర్వాత కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చేసింది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ఆయన రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నారు. దళిత, గిరిజన దండోరా పేరుతో పలు జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇదే ఊపులో ఆయన టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళుతున్నారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో శాంతిభద్రలు లోపించాయని.. హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.. అత్యాచారాలు, హత్యలు విచ్చలవిడిగా సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు వివరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈమేరకు అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

ఈనెల 17న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో ‘తెలంగాణ విమోచన దినం’ సందర్భంగా ఓ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ సైతం అదేరోజున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.. వెయ్యిమంది తెలంగాణ విమోచన యోధులను ఉరి తీసిన నిర్మల్‌లోని వెయ్యి ఉరీల మర్రి వద్ద బీజేపీ నాయకులు సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేడు అమిత్ షాకు లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

హోంమంత్రి అమిత్ షాకు రేవంత్ రెడ్డి ఓ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. ప్రజల అకాంక్షలకు భిన్నంగా పరిపాలన సాగిస్తోందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ డ్రగ్స్ దందాకు కేరాఫ్ గా మారిందని విమర్శించారు. ఇష్టారాజ్యంగా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. డగ్స్ ఊబిలో వందలాది మంది యువతీ యువకులు కురుకుపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గడిచిన ఆరేళ్లలో తెలంగాణలో శాంతిభద్రలు అదుపు తప్పాయని రేవంత్ రెడ్డి లేఖలో ఆరోపించారు. బహిరంగానే హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నీ కూడా తెలంగాణలో సామాజిక అస్థిరత్వానికి, అశాంతికి దారితీస్తున్నాయని వివరిస్తూ హోంమంత్రికి లేఖ రాశారు. ఈ పరిస్థితులపై హోంమంత్రి జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

అంతేకాదు సీఎం కేసీఆర్ ఏడేళ్ల పాలనలోని అవినీతి చిట్టా అంతా తన వద్ద ఉందని.. వాటిని ఆధారాలతో సహా కేంద్రహోంమంత్రి అమిత్ షాకు ఇస్తానని.. ఆయన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దీన్ని బట్టి ఇటు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను.. అటు బీజేపీని రేవంత్ ఇరుకునపెట్టినట్టైంది. చర్య తీసుకోకపోతే బీజేపీ విలన్ అవుతుంది. తీసుకుంటే కేసీఆర్ ఇరుకునపడేలా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు.

మొత్తానికి రేవంత్ రెడ్డి తాజాగా లేఖ బీజేపీ, టీఆర్ఎస్ లో హీట్ పుట్టిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ ఒకరిపై ఆరోపణలు చేసుకుంటుండగా ఢిల్లీలో మాత్రం ఒకటే అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ ఈ రెండు పార్టీల దోస్తీ తేల్చేందుకే కేంద్ర హోంమంత్రికి లేఖ రాయడం ద్వారా ఆపార్టీని డిఫెన్స్ లో పడేసినట్లు కన్పిస్తోంది. రేవంత్ లేఖపై హోంమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్న అది కాంగ్రెస్ పార్టీకే అడ్వాటేంజ్ గా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-