ఈటెల, నేను చీకట్లో కలవలేదు: రేవంత్ రెడ్డి

ఈటెలను రేవంత్‌రెడ్డి రహస్యంగా కలిశారన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో హాట్ టాపిక్‌గా మారాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక ముందు అధికార పార్టీ ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్షాలు డిఫెన్స్‌లో పడ్డాయి. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలకు ఆ రెండు పార్టీల నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఈటెల, తాను కలిసిన మాట నిజమేనన్నారు. అయితే తాము చీకట్లో కలవలేదని వివరణ ఇచ్చారు. ఈ ఏడాది మే 7న వేంనరేందర్‌రెడ్డి కొడుకు లగ్నపత్రిక సందర్భంగా గోల్కొండ రిసార్టుకు పలు పార్టీలకు చెందిన నేతలు వచ్చారని.. ఆ సమయంలో బహిరంగంగానే ఈటెల, తాము కలిశామని రేవంత్ తెలిపారు. ఈటెల తనను కలిసిన సమయంలో కేసీఆర్ చేసిన లంగా పనులన్నీ చెప్పారని పేర్కొన్నారు. చీకట్లో కలిసే అలవాటు కేసీఆర్ కుటుంబానికే ఉందన్నారు. ఈటెల రాజేందర్‌ను బీజేపీలో చేర్చుకోవడానికి కిషన్‌రెడ్డి వచ్చిన విమానం ఎవరిదో కేటీఆర్ చెప్పాలన్నారు. విమాన వివరాలు కేటీఆర్ చెప్తారా.. లేదా తనను బయట పెట్టమంటారో చెప్పాలని ప్రశ్నించారు.

Read Also: రేవంత్‌రెడ్డిని కలిశా.. అయితే తప్పేంటి?: ఈటెల రాజేందర్

హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలను ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకి లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడుదొంగలేనని.. ఇద్దరూ కలిసి పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. 20 ఏళ్లు జోడు గుర్రాల తరహాలో ఈటెల-హరీష్ రావు తిరిగారని, ఈటెల రాజేందర్ దేని కోసం కొట్లాడారో టీఆర్ఎస్ పార్టీ చెప్పాలన్నారు. ఈటెల అవినీతిపై విచారణ ఏమైందో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు, ఈటెలకు పడటం లేదని హరీష్ రావు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు ఎన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారో హరీష్‌రావు చెప్పాలని రేవంత్‌రెడ్డి సూటి ప్రశ్న వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు చెల్లని రూపాయి అని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ కేబినెట్‌లో ఉన్న 18 మంది మంత్రుల్లో ఒక్కరైనా మాదిగ ఉన్నారా అని ప్రశ్నించారు. మాదిగలు మంత్రులుగా పనికిరారా అని నిలదీశారు.

Related Articles

Latest Articles