నవ్వుల నావలు నడిపిన ఇ.వి.వి. సత్యనారాయణ

(జూన్ 10న ఇ.వి.వి. సత్యనారాయణ జయంతి)
ఆరోగ్యంగా ఉండాలంటే అన్నీ మరచి, హాయిగా నవ్వాలి అంటున్నారు లాఫింగ్ థెరపిస్టులు. మనసు బాగోలేనప్పుడు కాసింత ఊరట చెందటానికే చాలామంది సినిమాలను ఆశ్రయించేవారు. అలాంటి వారికి వినోదాల విందు అందించాలన్న సత్సంకల్పంతోనే ‘విజయా’వారు సినిమాలు తీశారు. ‘విజయా’వారి చిత్రాల్లోని పాటల మకుటాలతోనే సినిమాలు తీసి అలరించారు దర్శకరచయిత జంధ్యాల. అలాంటి జంధ్యాల దగ్గర పనిచేసిన ఇ.వి.వి.సత్యనారాయణ కూడా గురువు బాటలోనే పయనిస్తూ పలు నవ్వుల నావలు తయారు చేసి, సంసారసాగరాన్ని ఈదుతున్న వారికి వినోదం పంచారు.

ఆదుకున్న నాయుడు…
ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకుడు కావాలన్న అభిలాషతో పలువురు నిర్మాతలను కలిశారు. ఆయన కథలు విన్నవారు, నవ్వుకున్నవారు, నవ్వేసి ఊరకున్నవారూ ఇలా ఎంతోమంది ఉన్నారు. అయితే సత్యంలో ఏదో ఉందని గుర్తించినది నటనిర్మాత అశోక్ కుమార్. డి.రామానాయుడు మేనల్లుడైన అశోక్ కుమార్, ఇ.వి.వి.ని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘చెవిలో పువ్వు’ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలో అన్నీ అమరాయి. కానీ, సినిమా విజయాన్ని సాధించలేకపోయింది. టైటిల్ దెబ్బ కొట్టింది అని పలువురు చెప్పారు. ‘చెవిలో పువ్వు’ దర్శకత్వం వహించే సమయంలో ఎంతోమంది నిర్మాతలు ఇ.వి.వి.కి అడ్వాన్సులు ఇచ్చారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడక పోయేసరికి, ఇ.వి.వి.ని చూడగానే ముఖం చాటేసేవారు. అలాంటి సమయంలో ఇ.వి.వి.ని ప్రోత్సహించింది రామానాయుడే. అలా రామానాయుడు కాంపౌండ్ చేరిన ఇ.వి.వి. ‘ప్రేమఖైదీ’ని రూపొందించారు. ఈ సారి గురి తప్పలేదు. ‘ప్రేమఖైదీ’ మంచి విజయం సాధించింది. ఇక ఇ.వి.వి. వెనుతిరిగిచూసుకోలేదు.

సక్సెస్ రూటులో…
ఇ.వి.వి. సత్యనారాయణ గురువు జంధ్యాల లాగే నవ్వునే నమ్ముకొని ముందుకు సాగారు. రాజేంద్రప్రసాద్ హీరోగా “అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు, ఆలీబాబా అరడజన్ దొంగలు” వంటి చిత్రాలు రూపొందించి, ప్రేక్షకుల పొట్టలు చెక్కలు చేశారు. ఇక నరేశ్ తో ఇ.వి.వి. తెరకెక్కించిన ‘జంబలకిడి పంబ’ పూయించిన నవ్వులను ఎవరు మాత్రం మరచిపోగలరు. శ్రీకాంత్, హరీశ్, వినోద్ కుమార్ వంటి వర్ధమాన కథానాయకులకు ఇ.వి.వి. చిత్రాలే పేరు సంపాదించి పెట్టాయి. ఓ వైపు నవ్వులు పూయిస్తూనే మరోవైపు ‘ఆమె’ వంటి ఆలోచింప చేసే చిత్రాన్నీ రూపొందించారు. చిరంజీవితో ‘అల్లుడా మజాకా’, నాగార్జునతో ‘వారసుడు, హలో బ్రదర్’ , వెంకటేశ్ తో ‘అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు -వంటింట్లో ప్రియురాలు’ , బాలకృష్ణతో ‘గొప్పింటి అల్లుడు’ వంటి చిత్రాలను రూపొందించి ఆకట్టుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’ ని తెరకెక్కించిందీ ఇ.వి.వి.నే! అలా సక్సెస్ రూటులో భలేగా సాగిపోయారు ఇ.వి.వి. తానే నిర్మాతగా మారి, ఇ.వి.వి. సినిమా పతాకంపై తొలి ప్రయత్నంగా ‘చాలాబాగుంది’ తీశారు. తరువాత మరికొన్ని చిత్రాలు ఈ బ్యానర్ పైనే రూపొందించారు.

ఇ.వి.వి. ఇద్దరు కొడుకులు…
ఇ.వి.వి. సత్యనారాయణ ఇద్దరు కుమారుల్లో రాజేశ్ ను హీరోగానూ, నరేశ్ ను డైరెక్టర్ గానూ చూడాలనుకున్నారు. నరేశ్ కూడా కొన్ని సబ్జెక్టులు రాసుకున్నానంటూ చెప్పేవాడు. అయితే ‘అల్లరి’ చిత్రంతో నరేశ్ హీరో అయ్యాడు. అంతకు ముందు ఇ.వి.వి. డైరెక్షన్ లోనే ‘హాయ్’ చిత్రం ద్వారా రాజేశ్ హీరో అయినా, అంతగా అలరించలేకపోయాడు. ‘అల్లరి’ తరువాత నరేశ్ అల్లరి చేస్తూనే సక్సెస్ రూటులో సాగిపోయాడు. తనయులిద్దరినీ హీరోలుగా పెట్టి ‘నువ్వంటే నాకిష్టం’ తీశారు. అదీ అలరించలేకపోయింది. నరేశ్ తో కొన్ని నవ్వుల నావలు నడిపారు ఇ.వి.వి. అయితే మునుపటి స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. ఇ.వి.వి సినిమా పతాకంపై ఆ మధ్య నరేశ్ హీరోగా అతని అన్న రాజేశ్ ‘బందిపోటు’ అనే చిత్రాన్ని నిర్మించాడు. అయితే ఈ బందిపోటు జనాన్ని దోచుకోలేకపోయాడు. ఏది ఏమైనా ఇ.వి.వి. సత్యనారాయణ పేరు వినగానే ఆయన పండించిన నవ్వుల పువ్వులు ముందుగా గుర్తుకు వస్తాయి. తలచుకొనే కొద్దీ కితకితలు పెడుతూనే ఉంటాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-