సీఎస్సార్… తీరే వేరు!

(జూలై 11న సీఎస్సార్ ఆంజనేయులు జయంతి)

చిలకలపూడి సీతారామాంజనేయులు – ఇలా పూర్తి పేరు చెబితే ఎవరికీ ఆయన అంతగా గుర్తుకు రారు. సింపుల్ గా ‘సీయస్సార్’ అనగానే విన్నవారి పెదాలపై నవ్వులు నాట్యం చేయకమానవు. పీలగా ఉన్నా పేలిపోయే మాటలతో ఆకట్టుకోగలరు. ఎదుటివారి గాలితీస్తూ గేలిచేసేలా నటించి వినోదం పంచగలరు. అరుదైన వాచకంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసిన దిట్ట సీయస్సార్. ఆయన పరకాయప్రవేశం చేసిన అనేక పాత్రలు బుల్లితెరపై ఈ తరం వారినీ ఆకట్టుకుంటున్నాయి. ఆయన కేవలం కేరెక్టర్ యాక్టర్ అనుకుంటే పొరబాటే! తెలుగు సినిమా పలుకు నేర్చిన తొలి రోజుల్లోనే ‘రామదాసు’లో రామదాసుగానూ, ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’లో శ్రీకృష్ణునిగా, ‘పాదుకా పట్టాభిషేకం’లో శ్రీరామునిగా నటించిన సీయస్సార్ తరువాతి రోజుల్లో తనకు తగ్గ పాత్రలనే ఎంచుకున్నారు. వాటితోనే జనాన్ని మురిపించారు. అంతకు ముందు ఆయనను హీరోగా చూసిన వారు “సీయస్సార్ తీరే వేరు” అనేవారు. తరువాతి రోజుల్లో ఆయన తీరు మాత్రం జనాన్ని మరింతగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.

‘పాతాళభైరవి’లో రాజుగా, ‘కన్యాశుల్కం’లో రామప్ప పంతులుగా, ‘రోజులు మారాయి’లో జమీందార్ సాగరయ్యగా, ‘మాయాబజార్’లో శకునిగా, ‘అప్పుచేసి పప్పుకూడు’లో రావు బహదూర్ రామదాసుగా, ‘ఇల్లరికం’లో గోవిందయ్యగా, ‘జగదేకవీరుని కథ’లో బాదరాయణ ప్రగ్గడగా సీయస్సార్ ప్రదర్శించిన అభినయం అనితరసాధ్యం అనిపించక మానదు. విలక్షణంగా ఉండే ఆయన వాచకాన్ని, తరువాతి రోజుల్లో ఎందరో హాస్యనటులు అనుకరించి, ఆకట్టుకోవడం విశేషం. హీరోగా మెప్పించి, తరువాత హాస్యంతో మురిపించడం అన్నది అంత సులువైన విషయమేమీ కాదు. అలాంటి ఫీటును చేసి జనాన్ని రంజింప చేసిన మొదటి నటుడు సీయస్సార్ అనే చెప్పాలి. ఏది ఏమైనా సీయస్సార్ ఆంజనేయులు భావినటులకు ప్రేరణ కలిగించక మానరు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-