బాలీవుడ్ లోనూ రిలీజ్ డేట్స్ అటూ… ఇటూ…

పెద్ద సినిమాలు సీన్ లోకి రాగానే చిన్న సినిమాల విడుదల తేదీలలో మార్పులు జరగడం సహజం! గత కొద్ది రోజులుగా తెలుగు సినిమాల విడుదల తేదీలలో మార్పులు చాలానే జరుగుతున్నాయి. విశేషం ఏమంటే… ఇది టాలీవుడ్ కే పరిమితం కాలేదు. బాలీవుడ్ లో ఓ నెల రోజుల ముందు, 2022 క్యాలెండర్ ఇయర్ లో ప్రధాన చిత్రాల రిలీజ్ డేట్స్ ను దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు కారణాలు ఏవైనా… వాటిలో మార్పులు జరుగుతున్నాయి. తాజాగా ‘బధాయి దో’ మూవీ రిలీజ్ డేట్ కూడా మారిపోయింది. 2018లో వచ్చిన ‘బధాయి హో’ చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించడంతో పాటు జాతీయ స్థాయిలోనూ అవార్డులను గెలుచుకుంది. దీన్ని ఇతర భాషల్లోనూ రీమేక్ చేసే ప్రయత్నాలు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి కూడా!

ఇదే సమయంలో హర్షవర్థన్ కులకర్ణి దర్శకత్వంలో ‘బధాయి హో’కు సీక్వెల్ గా ‘బధాయి దో’ చిత్రం మొదలు పెట్టారు. ఈ లేటెస్ట్ మూవీలో రాజ్ కుమార్ రావ్, భూమి ఫడ్నేకర్ జంటగా నటిస్తున్నారు. మొత్తం మహిళలే ఉండే న్యూఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్ లో ఏకైక మగ పోలీస్ అధికారిగా రాజ్ కుమార్ రావ్ నటిస్తుంటే, పీటీ టీచర్ పాత్రను భూమి ఫడ్నేకర్ పోషిస్తోంది. ‘బధాయి హో’ చిత్ర కథకు దీనికి ఎలాంటి సంబంధం లేదని దర్శక నిర్మాతలు ముందే చెప్పేశారు. అయితే… రిపబ్లిక్ డే సందర్భంగా 2022 జనవరి చివరి వారంతో విడుదల అవుతుందని తొలుత తెలిపిన చిత్ర బృందం, ఇప్పుడీ సినిమాను 2022 ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని సినిమాల విడుదల తేదీలు అటూ ఇటూ అవుతాయో చూడాలి.

Related Articles

Latest Articles