జనసేనాని.. ఈ ‘గ్యాప్’ ఏంటోయి..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జోడు గుర్రాలపై స్వారీ చేస్తున్నారు. అటూ రాజకీయాల్లో, ఇటూ సినిమాల్లోనూ బీజీగా కొనసాగుతున్నారు. రాజకీయాలు పవన్ కల్యాణ్ కు కొత్తమే కాదు. ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పుడు పవన్ లో రాజకీయ నాయకుడు పుట్టారు. నాడు ఆ పార్టీ ఆశించిన సీట్లు సాధించకపోవడంతో ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిసిపోయింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లిన సంగతి అందరికీ తెల్సిందే.

2014లో పవన్ కల్యాణ్ పార్టీనైతే స్థాపించారుగానీ ఆ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చిన కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే పవన్ కల్యాణ్ నాటి ప్రభుత్వం ఎలాంటి పదవులు తీసుకోలేదు. ఆ తర్వాత టీడీపీకి పవన్ కల్యాణ్ కు మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో పవన్ కల్యాణ్ కిందటి ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది.

పవన్ కల్యాణ్ స్వయంగా రెండుచోట్ల ఓడిపోగా జనసేన పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచాడు. అయినప్పటికీ పవన్ కల్యాణ్ ఏదోవిధంగా పార్టీని ముందుకు తీసుకెళుతూనే ఉన్నారు. డబ్బుల సంపాదన కోసం సినిమాలు చేస్తూ వీలున్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే బీజేపీతో జనసేనకు పొత్తు కుదిరింది. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉండగానే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తామని ప్రకటించాయి.

అయితే కొంతకాలంగా జనసేన-బీజేపీ మధ్య గ్యాప్ వచ్చినట్లు కన్పిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయాలని భావించింది. ఈమేరకు ఆపార్టీ నుంచి జనసైనికులు కొందరు నామినేషన్లు కూడా వేశారు. అయితే తెలంగాణ బీజేపీ నేతలు పవన్ తో సంప్రదించి ఆ ఎన్నికల్లో జనసేనను సైడ్ చేశారు. ఈక్రమంలోనే ఆయన ఆ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పార్టీకి టిక్కెట్ దక్కుతుందని అంతా భావించారు. అయితే అక్కడ కూడా జనసేనకు నిరాశ దక్కింది.

ఈ క్రమంలోనే తెలంగాణలో ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో జనసేన టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి బీజేపీకి గట్టి షాకిచ్చింది. ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో పవన్ కల్యాణ్ బీజేపీ అభ్యర్థి గెలుపుకోసం ప్రచారం చేసినా పెద్దగా ఫలితం రాలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీ కూటమి కలిసి పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని జనసైనికులు పవన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయంలో పవన్ ఇన్ యాక్టివ్ కావడం.. బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించడం చూస్తుంటే ఇరుపార్టీల మధ్య కొంత గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల పవన్ కల్యాణ్ ఏపీలో రెండు ఉద్యమాలకు పిలుపునిచ్చారు. రోడ్ల దుస్థితి, ఉద్యోగాల క్యాలెండర్ పై స్పందించాలని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ రెండు కార్యక్రమాలను కూడా కేవలం జనసైనికులే ముందు తీసుకెళ్లారు. ఎక్కడ కూడా బీజేపీ నేతలు కన్పించలేదు. అదేవిధంగా బీజేపీ వినాయక చవితి ఉత్సవాల నిషేధంపై ఉద్యమానికి రెడీ అయింది. దీనికి జనసేన నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. దీంతో వీరిమధ్య గ్యాప్ వచ్చిందనే టాక్ విన్పిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో జగన్ టార్గెట్ గానే పవన్ కల్యాణ్ పోటీకి సై అంటుండగా.. బీజేపీ నేతల నుంచి ఆయనకు సహకారం లభించడం లేదని తెలుస్తోంది. దీనికితోడు బీజేపీ నేతల నుంచి పవన్ పై ఒత్తిళ్లు వస్తుండటంతో ఆయన ఆపార్టీతో అంటకాగేందుకు ఇష్టపడం లేదని తెలుస్తోంది. మరోవైపు పార్టీ క్షేత్రస్థాయిలో బలపడాలంటే పొత్తులతో ప్రయోజనం లేదని పవన్ భావిస్తున్నాడట. దీంతో బీజేపీని వదిలించుకోవడమే మంచిదని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి జనసేన ఒంటరిగానే బరిలో దిగుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉండటంతో అప్పటిలోగా ఏదైనా జరుగవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-