జ్యోతిరాదిత్య సింధియా ప్రగతి భవన్ కు వెళ్లడం వెనుక ఆంతర్యం ఏంటి..?

జ్యోతిరాదిత్య సిందియా ప్రగతి భవన్ కు వెళ్లడంతో తెలంగాణ బిజెపి నేతలు ఇరకాటంలో పడ్డారా ఇప్పటికే కేసీఆర్ డిల్లీ టూర్ ఓ పక్క, హుజూరా బాద్ ఎన్నికల షెడ్యూల్ రాక పోవడం మరోపక్క తెలంగాణ బిజెపి నేతల్ని ఇబ్బందుల్లో పడేశాయి. ఇప్పుడు కేంద్రమంత్రులు కూడా ప్రగతిభవన్‌ కి వెళ్లి కెసీఆర్‌ ని కలుస్తున్నారు.. తెలంగాణలో టియ్యారెస్‌ కు తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ రాష్ట్ర నేతలు ఈ పరిణామాలతో టెన్షన్‌ పడుతున్నారట.

ఓ వైపు తెలంగాణ బీజేపీ నేతలు టియ్యారెస్‌ సర్కార్ పై పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బండి సంజయ్ పాదయాత్ర కూడా చేపట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ బిజెపి తీరు ఇలా ఉంటే, అటు కేంద్రం తీరు దీనికి రివర్స్‌ లో ఉంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు కేసీఆర్ కు అపాయింట్ మెంట్స్ ఇస్తున్నారు. కొందరు మంత్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగుడుతూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. దీంతో కమలం పార్టీ రాష్ట్ర నేతలు ఇరకాటంలో పడుతున్నారట. ఇదేం పంచాయతీ దేవుడా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారట.

కేసీఆర్ డిల్లీ లో వారం రోజులకు పైగా ఉన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తో సహా కేంద్ర మంత్రులను కలిశారు. దీంతో బీజేపీ టియ్యారెస్‌ ఒక్కటేననే ఆరోపణలు పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ దీన్ని హైలైట్‌ చేస్తోంది. బీజేపీ ఈ అంశాన్ని ఎంత కవర్ చేయాలనుకున్నా, అనుమానాలని మాత్రం తొలగించలేకపోతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రాకపోవడంపై కూడా బీజేపీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మోదీని కెసీఆర్‌ కలిసిన తరవాతి రోజే ఎన్నికల కమిషన్ బెంగాల్ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

ఇవన్నీ ఇలా ఉంటే, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఏకంగా ప్రగతి భవన్ కే వెళ్ళారు. కేసీఆర్ తో కలిసి భోజనం చేశారు. సింధియా ప్రగతి భవన్ కి వెళ్తున్నారనే సమాచారం రాగానే రాష్ట్ర బీజేపీ నేతలు ఉలిక్కిపడ్డారు. ఊహించని పరిణామానికి షాక్ కి గురయ్యారు…

సింధియా కెసీఆర్‌ ని కలిస్తే, పార్టీకి డామేజ్ అవుతుందని కూడా భయపడ్డారట. ఆయన్ని, ప్రగతి భవన్ కి పోకుండా ఆపే ప్రయత్నం కూడా చేశారట. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ కార్యాలయానికి కూడా వస్తానని చెప్పారట.

అటు కేంద్రంలో ఓ రకంగా, ఇటు రాష్ట్ర నాయకత్వం మరో రకంగా టియ్యారెస్‌ ను డీల్‌ చేస్తుంటే, రాష్ట్రంలో పార్టీ నేతలు ఇరకాటంలో పడుతున్నారు. బీజేపీ ఈ పరిణామాలను ఏ విదంగా అధిగమిస్తుందో అనే ఆసక్తి ఏర్పడింది. ఈ తరుణంలో కమలనాథుల ఆశలన్నీ అమిత్ షా టూర్ పైనే ఉన్నాయట.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-