‘మా’ ఫలితాలు కొన్ని హోల్డ్ చేయడానికి కారణం అదేనా!?

మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్ ఎన్నికల ఓటింగ్ ఆదివారం మధ్యాహ్నం 3.00 గంటలకు పూర్తయ్యింది. అనుభవజ్ఞుల సమక్షంలో కౌంటింగ్ ను సా. 5.00 గంటలకు మొదలు పెట్టారు. గతంలో మాదిరి కాకుండా ఫలితాలు త్వరగానే వస్తాయని అంతా భావించారు. అయినా రాత్రి 10.30 వరకూ వాటిని అధికారికంగా తెలియచేయలేదు. ముందుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులలో విజేతలను ప్రకటిస్తారని, ఆ తర్వాతే ఆఫీస్ బేరర్స్ ఫలితాలు వెల్లడిస్తారని ముందు నుండి చెబుతూ వచ్చారు. కానీ నాటకీయ పరిణామాల మధ్య ఆఫీస్ బేరర్స్ కు చెందిన కేవలం నాలుగు పోస్టుల ఫలితాలను మాత్రమే ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ ప్రకటించారు. ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు, ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా శ్రీకాంత్, కోశాధికారిగా శివబాలాజీ ఎన్నికైనట్టు తెలిపారు. దాంతో మిగిలిన వారి ఫలితాలను ఎందుకు ప్రకటించలేదనే చర్చ మొదలైంది.

Read Also : మెగాస్టార్… టూ లేట్!?

విశ్వసనీయ సమాచారం ప్రకారం పై పోస్టుల ఫలితాలలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిగణనలోకి తీసుకోలేదు. అలా తీసుకోకుండానే వారిని విజేతలుగా ప్రకటించారు. కానీ మిగిలిన ఫలితాలను ప్రకటించాలంటే… వచ్చిన ఓట్లను బట్టి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకంగా మారే ఆస్కారం కనిపించింది. దాంతో వాటిని పరిగణించాలా వద్దా అనే అంశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే ఆ రిజల్ట్స్ ను హోల్డ్ లో పెట్టారని తెలుస్తోంది. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ లోని ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే (అందులో అత్యధికంగా విష్ణు ప్యానెల్ కు ఓట్లు పోలయ్యాయి) వైస్ ప్రెసిడెంట్ గా బరిలోకి దిగిన పృథ్వీ, బెనర్జీలో బెనర్జీ ఓటమి పాలయ్యే అవకాశం ఉందట. రెండు పోస్టులు ఉన్న వైస్ ప్రెసిడెంట్స్ లో మాదాల రవి (విష్ణు ప్యానెల్) ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో నిమిత్తం లేకుండా విజయం సాధించారు. అలానే సహాయ కార్యదర్శులుగా ఉత్తేజ్ (ప్రకాశ్ రాజ్ ప్యానెల్), గౌతంరాజు (విష్ణు ప్యానెల్) గెలిచారని అంటున్నారు. వారికి సంబంధించిన సమాచారం కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదే మాదిరిగా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ లో కూడా ఒకరిద్దరి ఫలితాలు తారుమారు అయ్యే ఆస్కారం ఉందని అంటున్నారు. సో… పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే విషయంలో ఓ క్లారిటీ వస్తే తప్పితే, మిగిలిన ఫలితాలను వెల్లడించే ఆస్కారం లేదు. అందుకే ఆదివారం రాత్రి కేవలం నాలుగు పోస్టుల రిజల్ట్ ను మాత్రమే ఎన్నికల అధికారి ప్రకటించారు. సో… ఇప్పుడిక ఏ నిమిషంలో అయినా వీటి ఫలితాలు ప్రకటించవచ్చు.

-Advertisement-'మా' ఫలితాలు కొన్ని హోల్డ్ చేయడానికి కారణం అదేనా!?

Related Articles

Latest Articles