అమెరికా ‘సై’ అన్నా అప్ఘన్ల పిరికితనమే తాలిబన్లకు వరమైందా?

యుద్ధం గెలవాలంటే.. నడిపించే నాయకుడు ఉండాలి.. దూసుకొస్తున్న బుల్లెట్లకు ఎదురెళ్లేంత సాహసం ఉండాలి.. వెన్ను చూపని వీరులను ఎన్నుకోవాలి.. శత్రువు ఎక్కువగా ఉన్నా సరే స్ఫూర్తిని పంచే నాయకుడు అయ్యిండాలి.. ‘బాహుబలి’ సినిమాలో కాలకేయులు లక్షల మంది ఉన్నా వేలమంది బాహుబలి సైన్యం ఎలా గెలిచింది? వారిలో స్ఫూర్తిని నింపి బాహుబలి ‘కాలకేయుడి’ని చంపేశాడు. కానీ అప్ఘనిస్తాన్ లో మాత్రం దీనికి రివర్స్ అయ్యింది. పోరాటం చేయాల్సిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కాడి వదిలేసి వేరే దేశం పారిపోయాడు. నడిపించే నాయకుడే పారిపోతే సైన్యం ఏం చేస్తుంది.. తమకెందుకు ఈ యుద్ధం అని కాడి వదిలేసి పారిపోతుంది. ఇప్పుడక్కడ అదే జరిగిందని తేలిపోయింది.అగ్రరాజ్యం అమెరికా తాము తోడుంటామని ఫైట్ చేయాలని సూచించినా కూడా అప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ భయపడి పారిపోయాడని తేటతెల్లమైంది. అందరూ ఊహించినట్టు అప్ఘన్ విషయంలో తప్పు అమెరికాది కాదని స్పష్టమైంది. సొంత దేశాన్ని ముందుండి నడిపించలేని అప్ఘనిస్తాన్ అధ్యక్షుడు, సైన్యందే తప్పు అని తాజాగా రుజువైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసిన ఆఫ్ఘానిస్థాన్ పై చర్చ నడుస్తోంది. కొద్దిరోజుల క్రితం తాలిబాన్లు అఫ్ఘాన్ ను ఆక్రమించి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆఫ్ఘాన్ ప్రజల నుంచి వారికి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో వారిపై కాల్పులకు, అఘాయిత్యాలకు పాల్పడుతూ అణిచి వేస్తున్నారు. ఈక్రమంలోనే మానవ హక్కులను కాలరాస్తున్న తాలిబన్లపై చర్యలు తీసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ విన్పిస్తుంది.

అప్ఘాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ నేపథ్యంలోనే తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించారనే విమర్శలు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నాయి. అయితే ఇందులో నిజంలేదని తాజాగా బయటపడిన ఓ ఫోన్ కాల్ సంభాషణ తేటతెల్లం చేస్తుంది. జూలై 23న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నాటి అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో చివరి సారిగా మాట్లాడారు. దాదాపు 14నిమిషాలపాటు కొనసాగిన వీరి సంభాషణ ప్రస్తుతం బయటికి వచ్చింది.

ఆఫ్ఘాన్ ను తాలిబన్లు ఆక్రమించడానికి ముందుగానే ఆ దేశానికి సైనిక సహాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే రోజురోజుకు ఆప్ఘాన్లో ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో పరిస్థితులను ఎదుర్కోనేందుకు పటిష్ట ప్రణాళిక తమ వద్ద ఉందని నిరూపించుకోవాలని ఆయన ఆఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనికి షరతు విధించినట్లు తెలుస్తోంది.

పరిస్థితులను నియంత్రణలోకి తీసుకొచ్చే ప్రణాళిక మీ దగ్గర ఉంటే మేము వాయుసేన ద్వారా సహాయం కొనసాగిస్తామని జో బైడెన్ హామీ ఇచ్చారు. సైనిక వ్యూహాల రూపకల్పనలో శక్తివంతమైన అఫ్ఘాన్ల సహాయం తీసుకోండి అంటూ సూచించారు. రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లా ఖాన్ మెహమ్మదీ వంటి వారిని తగిన బాధ్యతలు అప్పగించండి అంటూ జో బైడెన్ ఘనీకి సూచించారు.

ఆఫ్ఘాన్ బలగాలు తాలిబన్ల ముందు పెద్దగా పోరాట పటిమ చూపడం లేదనే అపవాదు ప్రపంచ వ్యాప్తంగా ఉందన్నారు. దీనిని చెరిపివేసుకోవాలని బాధ్యత మీపైనే ఉందని జోబిడెన్ సూచించారు. మీ వద్ద సురక్షితమైన సైన్యం 3లక్షల వరకు ఉందని.. తాలిబన్ల ముఠా కేవలం 70వేల లోపే ఉంటుందని అప్ఘాన్ అధ్యక్షుడిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు జో బిడెన్.

భవిష్యత్తులోనూ మీ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు హామీ ఇచ్చారు. రాజకీయంగా, ఆర్థికంగా, దౌత్యపరంగా కృషి చేస్తామని చెప్పారు. అయితే అష్రాఫ్ ఘనీ అమెరికా అధ్యక్షుడి సూచనలను పెద్దగా పట్టించుకోలేదు. తాలిబన్లకు పాక్ అన్ని వసతులు కల్పిస్తుందని బిడెన్ సంభాషణలో ఘనీ వ్యాఖ్యానించారు. కనీసం 15వేల మంది అంతర్జాతీయ ఉగ్రవాదులను తాలిబన్లతో కలిపి పాక్ అప్ఘన్ లో విధ్వంసం సృష్టిస్తోందని ఆరోపించారు.

ఇక హమీద్ కర్జాయ్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించాలని బైడెన్ సూచించగా ఘనీ ఇందుకు విముఖత చూపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కర్జాయ్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ఆయన నన్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని.. అమెరికా ఏజెంటుగా దూషించారని చెప్పుకొచ్చాడు. గతంలో ఆయనతో దాదాపు 110 నిమిషాలపాటు చర్చించానని ఫలితం మాత్రం రాలేదన్నారు.

అమెరికా అధ్యక్షుడు జోబిడెన్.. అఫ్ఘాన్ తాజా మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఫోన్ సంభాషణ చూస్తుంటే మాత్రం ఒక్కటి మాత్రం అర్థమవుతోంది. తాలిబన్లు అఫ్ఘానిస్తాన్ దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకోక ముందే అమెరికా సాయం చేసేందుకు ముందుకొచ్చింది. కానీ అష్రాఫ్ ఘనీ పిరికితనం కారణంగానే ఆ దేశంలో పరిస్థితి చేయిదాటిపోయినట్లు స్పష్టమైంది.

గత నెల 14న తాలిబన్లు కాబుల్ శివారల్లోకి చేరుకోవడంతో ఆ మరుసటి రోజే ఘనీ దేశం విడిపోయారు. అయితే అక్కడి పౌరులు మాత్రం తాలిబన్ల పాలనను ఒప్పుకునేది లేదంటున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాలు తాలిబన్ల వంశం కావడంతో స్థానికులు పోరాట స్ఫూర్తి చూపిస్తే తప్ప బయటి దేశాలు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఆఫ్ఘాన్ ప్రజలు ఎప్పుడు బయట పడుతారో వేచిచూడాల్సిందే..!

Related Articles

Latest Articles

-Advertisement-