ప్రమాదపు అంచున రాయల చెరువు…ఇళ్ళు వదలి..

చిత్తూరు జిల్లాలో రాయల చెరువు నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. వందకుపైగా గ్రామాలను, పది వేల మంది ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న రాయలచెరువు వ్యవహారంపై అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అసలు చెరువు ఈ స్థితికి చేరడానికి బాధ్యులెవరన్న ప్రశ్న ఇపుడు చర్చనీయాంశమవుతోంది.

ఆరు రోజుల కిందట చెరువు నిండినప్పుడే స్పందించి వుంటే వేలాదిమంది ఇళ్ళు వదలి వెళ్ళే పరిస్థితి వుండేది కాదంటున్నారు. రాయలచెరువు గురించి సమాచారం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు వేగంగా స్పందించి వుంటే ఈ పరిస్థితి తలెత్తివుండేది కాదన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది. మండల అధికారుల నుంచీ సమాచారం రాగానే జిల్లా అధికారులు రాయలచెరువును పరిశీలించి ప్రమాద తీవ్రతను అంచనా వేసి ఉండాల్సింది. ఈ చెరువులోకి 10వ తేది నుంచే వర్షపు నీరు రావడంతో 15వ తేదీకి నిండిపోయింది. 17వ తేదీకే చెరువు ప్రమాదకరంగా మారింది.

రాయలచెరువుకు ఎగువన మరో ప్రమాదం పొంచివుందన్న స్థానికులు చెబుతున్నారు. రాయలచెరువు పైన గోకులాపురం చెరువు, పిళ్ళారి కోన చెరువు, సంగటిముద్దల కోన చెరువు తదితర ఐదు చెరువులున్నాయి. ప్రస్తుతం వర్షం వల్ల ఈ ఐదు చెరువులూ నిండిపోయాయి. గోకులాపురం చెరువు ఇప్పటికే ప్రమాదకరంగా వుందని సమాచారం.

అది తెగితే కిందున్న మిగిలిన నాలుగు చెరువులూ తెగి, ఆ నీళ్లంతా రాయలచెరువు మీదపడతాయని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. చెరువు కింద రామచంద్రాపురం మండల పరిధిలో గ్రామాలున్నాయి. సంజీవరాయపురం, ప్రసన్న వెంకటేశ్వరపురం, బలిజపల్లి, గంగమాంబపురం, రామిరెడ్డిపురం, గంగిరెడ్డిపల్లి, కమ్మకండ్రిగ, మిట్టూరు, పద్మవల్లిపురం, నడవలూరు, నెన్నూరు, కేకేవీపురం, వెంకట్రామాపురం, గణేశ్వరపురం, సొరకాయలపాలెం, కమ్మపల్లి పంచాయతీలకు చెందిన 112 గ్రామాలున్నాయి. వీటితో పాటు తిరుపతి రూరల్‌ మండలం పరిధిలో కుంట్రపాకం, తనపల్లి, పాడిపేట, ముళ్ళఊడి, తిరుచానూరు గ్రామాలున్నాయి.

Related Articles

Latest Articles