అందాల అభినేత్రి రమ్యకృష్ణ

(సెప్టెంబర్ 15న అభినేత్రి రమ్యకృష్ణ పుట్టినరోజు)
రమ్యకృష్ణ- ఈ పేరులోనే అందం ఉంది. ఇక రమ్యకృష్ణ అందం ఆ రోజుల్లో ఎందరికో బంధాలు వేసింది. ప్రస్తుతం ఆమె అభినయంతో ఆకట్టుకుంటూ ఉన్నారు. అందాల అభినేత్రిగా సాగుతున్న రమ్యకృష్ణ ఇప్పటి ప్రేక్షకులకు ‘బాహుబలి’ సిరీస్ లో శివగామిగా గుర్తుండి పోయారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని వివాహమాడారు రమ్యకృష్ణ. వారికి ఓ బాబు ఉన్నాడు. ఇప్పటికీ రమ్యకృష్ణ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూ సాగుతున్నారు. ఆ రోజుల్లో గ్లామర్ గాళ్ గా అలరించిన రమ్యకృష్ణ, ఇప్పుడు అభినయంతో ఆకట్టుకుంటూ కొత్తవారికి నటనలో గ్రామర్ నేర్పుతున్నారు.

త‌మిళ‌నాట విర‌బూసిన వేయిరేకుల అందాల అర‌విందం ర‌మ్య‌కృష్ణ‌. తెలుగు సినిమాల‌తోనే ర‌మ్య‌కృష్ణ సౌంద‌ర్య‌గంధం విశేషంగా వీచింది. ద‌ర్శ‌కేంద్రుని మాయాజాలంతో ఈ అందం ప్రేక్ష‌కుల‌కు బంధాలు వేసింది. ఆ సౌంద‌ర్యం గంధాలు పూసింది.ఆ పూత‌లు ఏ నాటికీ ఇగిరిపోనివి. త‌రుగులేనివి. తిరుగులేని అభిమానం సొంతం చేసుకున్న‌వి. మ‌న టాప్ స్టార్స్ చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్, మోహ‌న్ బాబు అంద‌రితోనూ న‌టించి విజ‌య‌కేత‌నాలు ఎగ‌ర‌వేసిన ఘ‌న‌త ర‌మ్య‌కృష్ణ సొంతం. కృష్ణ హీరోగా రూపొందిన కంచుకాగ‌డాలో ఓ చిన్న పాత్ర‌లో క‌నిపించిన ర‌మ్య‌కృష్ణ త‌రువాత ప‌లు తెలుగు చిత్రాల‌లో చిన్న చిన్న పాత్ర‌లే పోషించారు. త‌న ద‌రికి చేరిన ప్ర‌తీ అవ‌కాశాన్నీ వినియోగించుకొనే ప్ర‌య‌త్నం చేశారు. అయితే రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో మోహ‌న్ బాబు నిర్మించి, న‌టించిన అల్లుడుగారుతోనే ర‌మ్య‌కృష్ణ‌కు మంచి విజ‌యం ల‌భించింది. ఆ త‌రువాత నుంచీ ర‌మ్య‌కృష్ణ అందం కోసం పందెం వేసుకుంటూ నిర్మాత‌లు ఆమె కాల్ షీట్స్ కై ప‌రుగులు తీశారు. అయితే రాఘ‌వేంద్ర‌రావు రూపొందించిన అల్ల‌రి మొగ‌డు, మేజ‌ర్ చంద్ర‌కాంత్, అల్ల‌రి ప్రియుడు, ఘ‌రానా బుల్లోడు, ముగ్గురు మొన‌గాళ్ళు, ముద్దుల ప్రియుడు, అన్న‌మ‌య్య‌ చిత్రాల‌లో ర‌మ్య అందం మ‌రింత సుగంధాలు విర‌జ‌ల్లింది. ఇత‌ర చిత్రాల‌లో చిరంజీవితో న‌టించిన అల్లుడా మ‌జాకా, బాల‌కృష్ణ‌తో జోడీ క‌ట్టిన బంగారుబుల్లోడు, వంశానికొక్క‌డు, నాగార్జున స‌ర‌స‌న అల‌రించిన హ‌లో బ్ర‌ద‌ర్ వంటి చిత్రాల్లోనూ ర‌మ్య‌కృష్ణ అందాల‌తో మురిపించారు. అందాల ఆర‌బోతతోనే సాగుతున్న ర‌మ్య‌కృష్ణ‌కు దాస‌రి నారాయ‌ణ‌రావు కంటే కూతుర్నే క‌నాలి చిత్రం న‌టిగానూ మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. అదే స‌మ‌యంలో ర‌జ‌నీకాంత్ న‌ర‌సింహ‌ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ ధ‌రించిన నీలాంబ‌రి పాత్ర ఆమెలోని న‌టిని మ‌రింత‌గా వెలికి తీసింది. ఆ త‌రువాత నుంచీ ర‌మ్య‌కృష్ణ‌కు అందాల పాత్ర‌ల‌తో పాటు, అభిన‌య ప్రాధాన్య‌మున్న కేరెక్ట‌ర్స్ కూడా ల‌భించాయి. టాప్ హీరోస్ తో టాప్ హిట్స్ చూసిన ర‌మ్య‌కృష్ణ యంగ్ హీరోస్ తోనూ చిందేసి క‌నువిందు చేశారు. సింహాద్రి చిత్రంలో జూనియ‌ర్ య‌న్టీఆర్ తో క‌ల‌సి ర‌మ్య‌కృష్ణ ఓ ఐట‌మ్ సాంగ్ లో అల‌రించిన తీరును జ‌నం మ‌ర‌చిపోలేరు. అందంతో మురిపిస్తూనే, అభిన‌యంతోనూ అల‌రించ‌డంలో త‌న‌దైన బాణీ ప‌లికిస్తూ సాగారు ర‌మ్య‌కృష్ణ‌. ఇక అప్ప‌టి దాకా న‌టించిన పాత్ర‌ల‌న్నీ ఒక ఎత్తు, బాహుబ‌లి సీరీస్ లో ద‌రించిన శివ‌గామి దేవి పాత్ర ఒక్క‌టీ మ‌రో ఎత్తు అన్న రీతిలో ర‌మ్య‌కృష్ణ అభిన‌యం సాగింది. ఉత్త‌రాదిన సైతం కొన్ని చిత్రాల‌లో ర‌మ్య అందం మురిపించింది. ఇక ద‌క్షిణాది అన్ని భాష‌ల్లోనూ ఆమె అభిన‌యం అల‌రించింది.

ప్ర‌స్తుతం ర‌మ్య‌కృష్ణ త‌న ద‌రికి చేరిన పాత్ర‌ల్లో న‌చ్చిన‌వాటిని ఎంచుకొని జ‌నం మెచ్చేలా అభిన‌యిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శక‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా రూపొందుతోన్న లైగ‌ర్లో ఓ ప్ర‌ధాన భూమిక పోషిస్తున్నారు ర‌మ్య‌కృష్ణ‌. అలాగే సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా తెర‌కెక్కుతోన్న రిప‌బ్లిక్లోనూ ఆమె న‌టిస్తున్నారు. భ‌విష్య‌త్ లోనూ ర‌మ్య‌కృష్ణ మ‌రిన్ని పాత్ర‌ల్లో న‌టిస్తూ జ‌నాన్ని మ‌రెంత‌గానో అల‌రిస్తార‌ని ఆశిద్దాం.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-