రా రమ్మని పిలిచే అందం… రకుల్ ప్రీత్ సింగ్ సొంతం…

(అక్టోబర్ 10న రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు)

నాజుకు షోకులతో కుర్రకారును ఇట్టే ఆకర్షించే అందం, చందం రకుల్ ప్రీత్ సింగ్ సొంతం. రకుల్ నవ్వు, చూపు, రూపు, నడక, నడత అన్నీ ఇట్టే ఆకర్షిస్తూ ఉంటాయి. అందువల్లే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలంటే కుర్రాళ్ళకు ఎంతో మోజు. తెలుగు చిత్రాలతోనే రకుల్ ప్రీత్ సింగ్ కు స్టార్ డమ్ లభించింది.

న్యూ ఢిల్లీలో 1990 అక్టోబర్ 10న రకుల్ ప్రీత్ సింగ్ ఓ పంజాబీ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఆర్మీ ఆఫీసర్. అందువల్ల బాల్యంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో చదివిన రకుల్, తరువాత జీసస్ అండ్ మేరీ కళాశాలలో గణితంలో పట్టా పుచ్చుకుంది. చదువుకొనే రోజుల్లోనే ఫ్యాన్సీ షోస్ లో భలేగా ఆకట్టుకొనేది రకుల్. దాంతో డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ లో అడుగుపెట్టింది. అలాగే డిగ్రీ పూర్తి అయ్యే సమయంలోనే ‘గిల్లీ’ అనే కన్నడ సినిమాలో తొలిసారి నటించింది రకుల్. తరువాత ‘కెరటం’ అనే తెలుగు సినిమాలో నాయికగా కనిపించింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం రకుల్ ప్రీత్ సింగ్ కు మంచి గుర్తింపును ఇచ్చింది. దాంతో తెలుగు చిత్రాలలో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది రకుల్. “రఫ్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్-2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, స్పైడర్, జయ జానకీ నాయక” వంటి తెలుగు చిత్రాలలో రకుల్ అందాల అభినయం ఆకట్టుకుంది.

సీనియర్ హీరోలతోనూ రకుల్ అదరహో అనిపించింది. బాలకృష్ణ హీరోగా రూపొందిన యన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’లో ‘వేటగాడు’లోని “ఆకు చాటు పిందె తడిసె…” పాటలో శ్రీదేవిలా కనిపించింది, అదే చిత్రంలో ‘బొబ్బిలిపులి’ సీన్ లోనూ శ్రీదేవిగా అలరించింది. ఇక నాగార్జున సరసన ‘మన్మథుడు-2’లో రకుల్ అందం చిందేసింది. ఆ మధ్య ‘చెక్’లో ఓ నాయికగా ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన క్రిష్ ‘కొండపొలం’ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ నటిగా మంచి మార్కులు సంపాదించింది. ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’ అనే తెలుగు, తమిళ భాషల్లో రూపొందే చిత్రంలో నటిస్తోంది రకుల్. ఈ సినిమాతో పాటు ‘అయలాన్’ అనే తమిళ చిత్రంలో శివకార్తికేయన్ జోడీగా అలరించనుంది. ఇక “ఎటాక్, మే డే, థ్యాంక్ గాడ్, డాక్టర్ జి, సిండ్రెల్లా” వంటి హిందీ చిత్రాల్లోనూ రకుల్ అభినయిస్తోంది. కమల్ హాసన్ తో శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఇండియన్-2’లోనూ రకుల్ అవకాశం అందుకుంది. మరి ఈ సినిమాలతో రకుల్ ప్రీత్ ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.

-Advertisement-రా రమ్మని పిలిచే అందం… రకుల్ ప్రీత్ సింగ్ సొంతం…

Related Articles

Latest Articles