26న 4 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ.. ఆ చట్టం తేవాల్సిందే..!

కేంద్రం కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాల్సిందే.. లేకపోతే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు సంయుక్త కిసాన్‌ మెర్చా నేత రాకేష్‌ టికాయత్‌.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేస్తున్న ఆందోళన ఏడాది దాటింది.. ఇక, ఆ వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. రైతులకు క్షమాపణలు కూడా చెప్పారు.. అయితే, కనీస మద్దతు ధర చట్టం తెచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు సంఘాలు చెబుతున్నాయి.. ప్రభుత్వం తన గూండా పద్ధతులను మానుకోవాలని, లేకుంటే జనవరి 26న నాలుగు లక్షల ట్రాక్టర్ల ర్యాలీ ఉంటుందని రాకేష్‌ టికాయత్‌ హెచ్చరించారు.

ముంబైలో జరిగిన రైతుల మహాపంచాయత్‌లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం తన ఆలోచన ధోరణి మార్చుకోవాలన్నారు. రైతులను తీవ్రవాదులుగా అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన… దమ్ముంటే రైతులపై కేసు నమోదు చేసిన జైల్లో పెట్టాలని సవాల్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ దమనకాండను ఏడాది నుంచి రైతులు భరిస్తూనే ఉన్నారని.. ఇప్పటికైనా తన ఆలోచనా ధోరణి మార్చుకుని… కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని డిమాండ్‌ చేశారు.. లేకపోతే.. జనవరి 26వ తేదీన 4 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ ఉంటుందని హెచ్చరించారు. కాగా, గత ఏడాది నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles