‘విశ్వాసం’తో శివకు రజనీకాంత్ సినిమా

రజనీకాంత్ తో సినిమా చేయాలన్నది తమిళ దర్శకుల కల. ఆ కలను ‘అన్నాత్తే’తో నెరవేర్చుకున్నాడు శివ. తెలుగులో గోపీచంద్ సినిమాతో దర్శకుడైన శివ తమిళంలో వరుస విజయాలతో టాప్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ‘అన్నాత్తే’తో కమర్షియల్ హిట్ కూడా సాధించాడు. నిజానికి ఈ సినిమా అవకాశం శివకు తను అంతకు ముందు డైరెక్ట్ చేసిన ‘విశ్వాసం’ వల్లే లభించిందట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు స్వయంగా రజనీనే.


‘అన్నాత్తే’ అనుభవాలను వాయిస్ నోట్ ద్వారా పంచుకున్న రజనీ దానిని హూట్ యాప్‌లో పోస్ట్ చేశాడు. ‘నేను నటించిన ‘పేట్ట’ అజిత్ ‘విశ్వాసం’ ఒకే టైమ్ లో విడుదలయ్యాయి. రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్స్ గా నిలిచాయి. ‘విశ్వాసం’ నిర్మాతను స్క్రీనింగ్ ఏర్పాటు చేయమని అడిగాను. ఫస్ట్ హాఫ్‌ వరకూ చూసిన తర్వాత ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేంత ప్రత్యేకత లేదే అనుకున్నాను. అయితే క్లైమాక్స్‌కి వచ్చేసరికి సినిమా స్వరూపం మారిపోయింది. పూర్తయ్యాక చప్పట్లు కొట్టకుండా ఉండలేక పోయాను. నిర్మాత త్యాగరాజన్‌ని అభినందించి దర్శకుడు శివతో మాట్లాడాలని చెప్పాను. ఫస్ట్ మీట్ లోనే శివ అంటే ఇష్టం ఏర్పడింది.

అమాయకంగా, నిజాయితీగా మాట్లాడాడు. తప దగ్గర ఏదైనా కథ ఉందా? అడిగాను. ఆ కథ ‘విశ్వాసం’లా హిట్ కొట్టాలని చెప్పాను. అయితే నాతో హిట్ సినిమా చేయడం చాలా ఈజీ అని శివ చెప్పాడు. అంతకు ముందు ఏ ఇతర దర్శకుడు నాతో అలా చెప్పలేదు. శివలోని విశ్వాసం నాకు బాగా నచ్చింది. అంతే కాదు 20 రోజుల్లోనే శివ స్క్రిప్ట్ పూర్తి చేసి నన్ను కలిశాడు. రెండు గంటలకు పైగా నేరేషన్ ఇచ్చాడు. స్క్రిప్ట్ విన్నాక కన్నీళ్లు వచ్చాయి. చెప్పిన విధంగా సినిమా చేయమన్నాను. నేరేషన్ కంటే మెరుగ్గా చేస్తానని మాట ఇచ్చాడు. అన్నట్లుగానే నాకు సూపర్‌హిట్‌ అందించాడు’ అని చెప్పాడు రజనీ. దీపావళికి విడుదలైన ‘అన్నాత్తే’లో కీర్తి సురేష్, నయనతార, మీనా, కుష్బూ కీలక పాత్రలు పోషించారు.

Related Articles

Latest Articles