రాజేంద్రనగర్‌లో బాలుడు మృతిపై బిగ్ ట్విస్ట్ !

గత నాలుగు రోజుల‌ క్రితం రాజేంద్రనగర్ హైదర్‌గూడలో అదృశ్యమైన బాలుడు అనీష్ కుమార్ మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అనీష్ కుమార్ ది‌ ముమ్మాటికి హత్యేనని అంటున్నారు.గురువారం మధ్యాహ్నం అదృశ్యమైన అనీష్ కుమార్ కోసం చుట్టు పక్కల మొత్తం వెతికారు. బాలుడి మృతదేహం లభించిన నీళ్ల కుంట వద్ద కూడా పోలీసులతో ముందు రోజే గాలించారు. అక్కడ బాలుడికి సంబంధించిన ఏలాంటి ఆనవాలు లభించలేదు. కానీ మరుసటి రోజు మృతదేహం నీళ్ల కుంట లోకి ఏలా వచ్చింది? గురువారం గట్టుపై కనిపించని టీ షర్టు శుక్రవారం రోజు ఏలా వచ్చింది? కుటుంబసభ్యుల అనుమానాలకు సమాధానం మాత్రం లభించట్లేదు.

తన మనవడిని ఎవరో పొట్టన పెట్టుకున్నారని అంటున్నారు బాలుడి తాత. చిత్ర హింసలు పెట్టి హత్య చేసారని వాపోయాడు. ముఖం పై గాయాలు ఉన్నాయని.. కన్ను గుడ్డును తీవ్రంగా గాయపర్చారని చెప్పాడు. నోట్లో యాసిడ్ పోసారని ఆరోపిస్తున్నాడు.అపార్ట్‌మెంట్‌లో గత వారం రోజులుగా సీసీ కెమెరాలు పని చేయకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుందంటున్నాడు తండ్రి శివశంకర్. అదృశ్యం అయిన రోజే కొత్త సెక్యూరిటీ గార్డు వచ్చాడని.. అదే రోజు సెక్యూరిటీ గార్డు మారడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. తన కుమారుడి మరణం పై లోతుగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసాడు. పోలీసులు బాలుడి మృతిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. వారి అనుమానాలను పోలీసులు ఎలా నివృత్తి చేస్తారో చూడాలి.

Related Articles

Latest Articles