రౌద్రం… ర‌ణం…రుధిరం… రియ‌ల్ మ్యాజిక్ ఆఫ్ రాజ‌మౌళి!

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎస్.ఎస్.రాజ‌మౌళి చిత్రాల‌ను అభిమానించే వారంద‌రికీ క‌న్నుల పండుగ చేస్తూ ఆర్.ఆర్.ఆర్. ట్రైల‌ర్ నేడు జ‌నం ముందు నిల‌చింది. దీనిని చూసిన జ‌న‌మంతా జ‌న‌వ‌రి ఏడు ఎప్పుడు వ‌స్తుందా అన్న భావ‌న‌కు లోన‌య్యారంటే అతిశ‌యోక్తి కాదు. ట్రిపుల్ ఆర్ అంటే రాజ‌మౌళి, రామారావు, రామ్ చ‌ర‌ణ్ తో పాటు టైటిల్ కు త‌గ్గ‌ట్టుగానే రౌద్రం... రణం...రుధిరం... అన్నీ క‌నిపించేలా ట్రైల‌ర్ ను రూపొందించారు రాజ‌మౌళి. ఈ ట్రైల‌ర్ ను చూసిన వెంట‌నే సినిమా చూసేయాలన్నంత ఉత్సాహానికి గుర‌య్యారు ప్రేక్ష‌కులు. ఆ భావ‌నే ఈ సినిమాకు ఘ‌న‌విజ‌యం చేకూర్చ‌గ‌ల‌ద‌ని చెప్పేసింది. ఇక ట్రిపుల్ ఆర్ ఘ‌న‌విజ‌యం లాంఛ‌న ప్రాయ‌మే అనీ అంటున్నారు ట్రైల‌ర్ చూసిన‌వారు. హాలీవుడ్ ను సైతం స‌వాల్ చేసే సినిమాల‌ను తీసే స‌త్తా ఉన్న రాజ‌మౌళి ఈ సారి త‌ప్ప‌కుండా హాలీవుడ్ కే స‌వాల్ విస‌రుతాడ‌ని కొంద‌రు అభిమానులు అంటున్నారు.

Read Also : “ఆర్ఆర్ఆర్” రికార్డుల వేట స్టార్ట్… లాంగెస్ట్ ట్రైలర్

ట్రైల‌ర్ లోకి ఒక‌సారి తొంగి చూస్తే – జూనియ‌ర్ య‌న్టీఆర్ కు, రామ్ చ‌ర‌ణ్ స‌మాన‌మైన ప్రాధాన్య‌మున్న‌ట్టు ఇట్టే తెలిసిపోతోంది. త‌న తొలి య‌న్టీఆర్ నే ట్రైల‌ర్ లో ముందుగా చూపించి, రాజ‌మౌళి త‌న‌దైన బాణీ ప‌లికించారు. అందునా పులితో త‌ల‌ప‌డే స‌న్నివేశాన్ని చూపించ‌డంతో యంగ్ టైగ‌ర్ ఫ్యాన్స్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వెంట‌నే రామ్ చ‌ర‌ణ్ ను కూడా పోలీస్ గెట‌ప్ లోనూ, గుర్రంపై ఆయ‌న‌ను చూపించ‌డంతో మెగాప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ సైతం సంతోషంతో సంబ‌రంగా ఉన్నారు. న‌వ‌త‌రం మేటి హీరోలు ఇద్ద‌రితో రాజ‌మౌళి తెర‌కెక్కించిన అస‌లు సిస‌లు మ‌ల్టీస్టార‌ర్గా ట్రిపుల్ ఆర్ జ‌నం మదిని ట్రైల‌ర్ తోనే గెలుచుకుంది.

మూడు నిమిషాల ప‌దిహేను సెకండ్ల ట్రిపుల్ ఆర్ ట్రైల‌ర్ ను ఇప్ప‌టికే ఫ్యాన్స్ ప‌దే ప‌దే తిల‌కించ‌డం, ఆ సినిమాపై వారికి ఉన్న క్రేజ్ ను చెప్ప‌క‌నే చెబుతోంది. ఈ మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా పాట‌ల కంటే మిన్న‌గా ట్రైల‌ర్ హ‌ల్ చ‌ల్ చేయ‌డం విశేషం.

Read Also : రష్మిక ప్యారిస్ ట్రిప్… అక్కడ జరిగింది ఏంటో రివీల్ చేసిన బ్యూటీ

గోండ్ల పిల్ల‌ను స్కాట్ దొర‌వారు తీసుకు వ‌చ్చార‌న‌గానే, వాళ్ల‌కేమ‌న్నా రెండు కొమ్ములుంటాయా అని అడగ్గానే ఓ కాపరి ఉంటాడు... అని చెప్ప‌డంలోనే క‌థ‌ను ప్రేక్ష‌కుల ఊహ‌కు అందించేశారు రాజ‌మౌళి.
పులిని ప‌ట్టుకోవాలంటే...వేట‌గాడు కావాలి... అంటూ చెప్ప‌డంతో యంగ్ టైగ‌ర్ కేరెక్ట‌ర్ ను ఇట్టే చెప్పేశారు.
ఆ ప‌ని చేయ‌గ‌లిగేది...ఒక్క‌డే... అంటూ మూడు క‌ట్స్ లో రామ్ చ‌ర‌ణ్ ను చూపించ‌డంతో అత‌ని పాత్ర స్వ‌భావాన్నీ చెప్ప‌క చెప్పారు.
ఆ త‌రువాత య‌న్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ మ‌ధ్య స్నేహాన్నీ చూపిస్తూ… ప్రాణం క‌న్నా విలువైన నీ సోప‌తి నా సొంత‌మ‌న్నా... అన‌డంలోనూ ఆ పాత్ర‌ల మ‌ధ్య అనుబంధాన్నీ చెప్పేశారు. ఆపై బ్రిటిష్ ప్ర‌భుత్వానికి ఎదురు తిరిగిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను... అంటూ రామ్ చ‌ర‌ణ్ పాత్ర ప‌ల‌క‌డంతో క‌థ‌పై మ‌రింత ఆస‌క్తి పెరిగేలా చేశారు.
తొంగి తొంగి న‌క్కి న‌క్కి కాదే... తొక్కుకుంటూ పోవాలే... ఎదురొచ్చినోణ్ణి ఏసుకుంటూ పోవాలే...అనే జూనియ‌ర్ డైలాగ్… చాలా ప్ర‌మాదం... ప్రాణాలు పోతాయ్ రా... అన్న వాయిస్ ఓవ‌ర్ కు ఆనందంగా ఇచ్చేస్తాను బాబాయ్... అంటూ చెర్రీ చెప్పే డైలాగ్ కూడా క‌థ‌లోకి చూసిన వారిని తీసుకుపోయాయి…

అల్లూరి సీతారామ‌రాజు లాగా రామ్ చ‌ర‌ణ్, కొమ‌రం భీమ్ లాగా జూనియ‌ర్ య‌న్టీఆర్ క‌నిపించే దృశ్యాలు మ‌రింత ఆస‌క్తిని పెంచేశాయి. త‌రువాత రామ్ చ‌ర‌ణ్ స్వ‌రంలో వినిపించే భీమ్... ఈ న‌క్క‌ల వేట ఎంత సేపు కుంభ‌స్థ‌లాన్ని బ‌ద్ద‌లు కొడ‌దాం ప‌దా... అన్న మాట‌లు – రాజ‌మౌళి త‌న హీరో ద్వారా త‌న మ‌నోగ‌తాన్ని తెలిపిన‌ట్టుగా ఉంది. ఈ డైలాగ్ లోని భావం – లోక‌ల్ సెంట‌ర్స్ లో కాదు, యూనివ‌ర్స‌ల్ హిట్ నే ప‌ట్టేద్దాం ప‌దా అన్న‌ట్టుగా ఉంద‌ని కొంద‌రు అభిమానులు అంటున్నారు.

ట్రిపుల్ ఆర్ ట్రైల‌ర్ చూసిన వారికి త‌ప్ప‌కుండా సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆస‌క్తి క‌ల‌గ‌క మాన‌దు. జ‌న‌వ‌రి ఏడు కోసం చూసిన జ‌నం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైల‌ర్ లో రాజ‌మౌళి మ్యాజిక్ క‌నిపించింద‌నీ అంటున్నారు. ఆ మ్యాజిక్ జ‌న‌వ‌రి 7న జ‌నాన్ని ఏం చేస్తుందో? బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి.

Related Articles

Latest Articles