గాల్లో వేలాడుతున్న రైల్వే ట్రాక్.. నిలిచిపోయిన రైళ్లు

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని పెన్నా నది ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడ-చెన్నై మార్గంలోని పడుగుపాడు వద్ద రైలుపట్టాలపైకి నీళ్లు చేరాయి. కాసేపటికే వరద ఉధృతి కారణంగా రైల్వేట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. దీంతో పలు చోట్ల రైలుపట్టాలు గాల్లో వేలాడుతున్నాయి.

Read Also: అలెర్ట్ : ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు

ఈ నేపథ్యంలో విజయవాడ-చెన్నై మార్గంలో రెండు రోజుల పాటు రైళ్ల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు చేసేదేమీలేక నెల్లూరు-పడుగుపాడు మధ్య రైలు ట్రాక్‌పై నడుచుకుంటూ చాలామంది ప్రయాణికులు పిల్లలతో సహా స్వస్థలాలకు వెళ్తున్నారు. ఈ ఘటనలు చూసి చాలామంది కరోనా లాక్‌డౌన్ సమయం నాటి పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే కోవూరు దగ్గర జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

Related Articles

Latest Articles