టి.కాంగ్రెస్‌ నేతల హస్తిన బాట.. రాహుల్‌తో కీలక సమావేశం..

తెలంగాణ పొలిటికల్‌ హీట్‌ ఇప్పుడు హస్తిన తాకింది.. తన పాదయాత్రకు ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్లి వస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక, ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నేతలు హస్తినబాట పట్టారు.. కొత్త పీసీసీ చీఫ్‌ను.. కొత్త కమిటీలను ప్రకటించిన తర్వాత తొలిసారి అందరితో సమావేశం అయ్యేందుకు సిద్ధం అయ్యారు రాహుల్‌ గాంధీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్‌ గాంధీతో టి.కాంగ్రెస్‌ నేతలు భేటీ కానున్నారు.. ఇప్పటికే 10 మందికి ఆహ్వానం పంపింది ఏఐసీసీ.. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, ఐదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, కమిటీల చైర్మన్లతో రాహుల్ సమావేశం కానుండగా.. ప్రతి నాయకుడితో రాహుల్‌ గాంధీ వ్యక్తిగతంగా మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.. కొత్త కమిటీ నియామకం తర్వాత మొదటిసారి రాహుల్‌తో టి.కాంగ్రెస్‌ నేతలతో భేటీ కానుండడంతో ప్రాధాన్యత ఏర్పడింది.

కాగా, పీసీసీ చీఫ్‌ పదవికి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత.. పీసీసీ పోస్టు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేశారు.. కొన్ని సందర్భాల్లో లీక్‌లు బయటికి రావడంతో.. అలకల పర్వం, బహిరంగ విమర్శలు పర్వం జోరుగానే సాగింది. ఇక, కొత్త పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ రెడ్డి నియామకం తర్వాత కూడా సంచలన ఆరోపణలు, బహిరంగ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.. ఇప్పటికే పార్టీలోని కొందరు సీనియర్లు.. పీసీసీ చీఫ్ మధ్య సరైన కమ్యూనికేషన్‌ లేదని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. అయితే, కొత్త చీఫ్, కొత్త కమిటీలు వచ్చిన తర్వాత పార్టీలో జోష్ పెరిగినా.. అంతర్గత పోరు కూడా నడుస్తూనే ఉంది.. ఈ నేపథ్యంలో.. రాహుల్‌ గాంధీ సమావేశం ఆసక్తికరంగా మారింది.

Related Articles

Latest Articles

-Advertisement-