రేవంత్ పై ఫిర్యాదును పట్టించుకోని రాహుల్.. ఆ నేతలకు షాకిచ్చినట్టేనా?

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. వీరికి బయటి శత్రువుల కంటే లోపటి శత్రువులే ఎక్కువ అని ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెబుతుంటారు. మహాసముద్రం లాంటి కాంగ్రెస్ ను ఈదలాంటే చిన్నచిన్న చేపలు బలి కావాల్సిందనేలా ఆపార్టీ నేతల తీరు ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవి అంటే నేతలంతా సీఎం పదవితో సమానంగా చూస్తుంటారు. దీని కోసం నేతల మధ్య కుస్తీలు మామూలుగా ఉండవు. ఈ విషయం మొన్నటి టీపీసీసీ చీఫ్ నియామకంతో అందరికీ తెలిసి వచ్చి ఉంటుంది. ఈ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ లో చిన్నస్థాయి నేత నుంచి అగ్రస్థాయి నేత వరకు ఢిల్లీలో లాబీయింగ్ చేశారు. అయితే రేవంత్ రెడ్డికి లక్ కలిసి రావడంతో అధిష్టానం ఆయనవైపు మొగ్గుచూపింది. దీంతో ఎన్నాళ్ల నుంచో కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్న కొత్త టీపీసీసీ అంకానికి తెరపడినట్లయ్యింది.

రేవంత్ రెడ్డి టీపీసీసీ అయ్యాక కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నెలకొంది. టీఆర్ఎస్ కు ధీటైన నాయకుడు దొరకాడంటూ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగానే రేవంత్ పై విమర్శలు చేస్తున్నారు. టీపీసీసీ నిర్ణయాలను ధిక్కరిస్తూ రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు. రేవంత్ రెడ్డికి కొత్త టీపీసీసీ కార్యవర్గం పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది. కొందరు రేవంత్ వెంటే ఉంటూ అధిష్టానానికి ఆయనపై వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి.

రాహుల్ గాంధీతో ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. కొత్త టీపీసీసీ కార్యవర్గం నియామకం అయ్యాక రేవంత్ రెడ్డి సహా ముఖ్యనేతలతో రాహుల్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కూడా నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. కొందరు నేతలు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వివరించినట్లు తెలుస్తోంది. అయితే మరికొందరేమో రేవంత్ రెడ్డిపై పరోక్షంగా ఫిర్యాదు చేసేందుకు యత్నించారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలను అందరితో చర్చించి తీసుకుంటారు.. కానీ కొత్త నాయకత్వం ఆ పని చేయడం లేదని నేతలు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సమావేశం కంటే ముందుగానే రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై ఆరా తీసుకున్నట్లు టాక్. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ నియామాకం అయ్యాక కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చిందని ఆయనకు నివేదికలు అందించినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ నేతలు రేవంత్ పై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా ఆయన పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.

తెలంగాణ పార్టీ రేవంత్ రెడ్డితో మళ్లీ పుంజుకుంటుందని.. ఈ సమయంలో నేతలంతా కలిసి కట్టుగా పని చేయాలని రాహుల్ గాంధీ సూచించినట్లు సమాచారం. రాహుల్ గాంధీ తనపై నమ్మకం పెట్టుకోవడంతో రేవంత్ రెడ్డి ఈ భేటి తర్వాత ఫుల్ జోష్ లో కన్పిస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతం కాంగ్రెస్ రేవంత్ శకం మొదలైనట్లే కన్పిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-