రాహులే మా నాయకుడు అంటున్న కాంగ్రెస్..!

వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం మహాసంద్రంలో నావలా తయారైంది. మోదీ హవాను తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారానికి దూరమైంది. ఈ ప్రభావం రాష్ట్రాలపై పడటంతో కాంగ్రెస్ క్రమంగా గత వైభవాన్ని కోల్పోతూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కు ఉన్న సోనియాగాంధీకి వయస్సు పైబడటం, అనారోగ్య కారణాలతో ఆ బాధ్యతను తన కుమారుడు రాహుల్ గాంధీకి అప్పగించే ప్రయత్నం చేశారు. ఒకసారి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ గత సార్వత్రిక ఎన్నికల్లో విఫలమై ఆ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగుతున్నారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవి ‘గాంధీ’ ఫ్యామిలీ నుంచి చేజారితే ఏం జరుగుతుందో సోనియాగాంధీకి బాగా తెలుసు. అందుకే ఆమె ఆ బాధ్యతను వేరొకరికి ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. గత రెండేళ్లుగా అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని సోనియాగాంధీ భావించినా ఫలితం లేకుండా పోయింది. రాహుల్ గాంధీ పదవి చేపట్టేందుకు ససేమిరా అంటుండటంతో ఎన్నిక పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. గతంలో కంటే భిన్నమైన రీతిలో అధికారపక్షంపై విమర్శలు చేస్తున్నారు. పార్టీ బాధ్యతలను.. పీసీసీ నియామకాలను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈక్రమంలోనే రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయాలనే డిమాండ్ ను యూత్ కాంగ్రెస్ మరోసారి తెరపైకి తీసుకొస్తుంది.

రాహుల్ గాంధీ 2004 నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. 2004లో లోక్ సభలోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీ 2007లో కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీగా నియామకమయ్యారు. 2013లో కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి చేపట్టగా 2017లో అధ్యక్ష పదవిని చేపట్టారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడంతో నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ పదవికి రాజీనామా చేయద్దని సీనియర్లు రాహుల్ గాంధీని వారించినా ఆయన ససేమిరా అన్నారు. నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు లేకుండా పోయాడు. గత్యంతరంలేని పరిస్థితుల్లో సోనియాగాంధీనే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా నాటి నుంచి కొనసాగుతున్నారు.

ప్రస్తుతం రాహుల్ గాంధీ గతంలో కంటే చాలా యాక్టివ్ గా రాజకీయాలను చేస్తున్నారు. అధ్యక్ష హోదా లేకపోయినా పార్టీని అన్ని తానై నడిపిస్తున్నాడు. గతంలోనే పలుమార్లు ఆయనను తిరిగి అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నించారు. అయితే కరోనా కారణంగా ఈ నిర్ణయం కార్యరూపం దాల్చలేదని తెలుస్తోంది. ఈక్రమంలోనే రాహుల్ గాంధీనే అధ్యక్షుడిగా చేయాలని యూత్ కాంగ్రెస్ నుంచి బలంగా డిమాండ్ వస్తోంది. తాజాగా గోవాలో జ‌రిగిన ఐవైసీ జాతీయ ఎగ్జిక్యూటివ్‌ల స‌మావేశంలో ఈమేర‌కు తీర్మానాన్ని వారంతా ఆమోదించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టకపోవచ్చనే టాక్ విన్పిస్తోంది.

ఈ ఎన్నికలు ముగిశాక వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకొని రాహుల్ అధ్యక్ష పదవిని చేపట్టాలా? లేదా అనేది డిసైడ్ అవుతారని తెలుస్తోంది. ఒకవేళ తాను అధ్యక్ష పదవి చేపట్టాలనుకుంటే మాత్రం తనతో పూర్తిగా యంగ్ టీం ఉండాలని ఆయన భావిస్తున్నారట. ప్రస్తుతం యువకుల్లో ప్రభావంతమైన నాయకులు ఎక్కువగా లేరని తెలుస్తోంది. దీంతో ఆయన తనకు అధ్యక్ష పదవి లేకపోయినా పార్టీ కోసం పని చేస్తానని చెబుతున్నారట. అయితే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఆయన తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితం తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదిఏమైనా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ విషయంలో పాత డిమాండ్ నే కొత్తగా తెరపైకి తెస్తుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-