టీమిండియాకు కొత్త కోచ్‌.. ద్రవిడ్‌కు దాదా ఇచ్చిన ఆఫర్ ఎంతో తెలుసా..?

టీమిండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ అయితే బాగుంటుంది అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.. అందుకు ప్రధాన కారణం ఇండియా ఏ మరియు అండర్‌ 19 జట్లను ఆయన నడిపిస్తున్న తీరే కారణం.. ఇక, ఏ వివాదాల జోలికి పోని వ్యక్తి.. మరోవైపు, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీతో మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి కూడా.. అదే ఇప్పుడు మిస్టర్ డిపెండబుల్ ను టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవికి చేరువ చేసింది.. త్వరలోనే ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి పదవి కాలం ముగియనుంది.. దీంతో.. కొత్త కోచ్‌ వేటలో పడింది బీసీసీఐ.. ఈ రేసులో చాలా మంది పేర్లే వినిపించాయి.. ముఖ్యంగా టామ్ మూడీ, మహేళ జయవర్ధనే, రికీ పాంటింగ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే పేర్లు ప్రముఖంగా వినిపించాయి.. అయితే, గతంలో కోహ్లీ ఆటిట్యూడ్ వల్లే తప్పుకున్నాను.. మళ్లీ ఆ సాహసం చేయలేను అంటూ కుంబ్లే నిరాకరించగా.. వీవీఎస్ లక్ష్మణ్ కి ఆసక్తి ఉన్నా.. బీసీసీఐ మాత్రం లైట్‌ తీసుకుంది.. చివరికి ద్రవిడ్ వైపే మొగ్గు చూపింది.

ఈ ఏడాది అక్టోబరు 17 నుంచి నవంబర్‌ 14వ తేదీ వరకు టీ20 వరల్డ్‌కప్ జరగనుంది.. ఈ టోర్నీతో హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం కూడా పూర్తి కానుంది.. ఆ పదవి రేస్‌లో రాహుల్ ద్రవిడ్ పేరు ప్రముఖంగా వినిపించినా.. ద్రవిడ్‌ మాత్రం నిరాకరిస్తూ వచ్చారు.. అయితే, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీయే నేరుగా రంగంలోకి దిగారు.. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా.. స్వయంగా ద్రవిడ్‌తో మాట్లాడారు.. ద్రవిడ్‌ కాస్త వెనుకడుగు వేసినా.. దాదా పట్టుబట్టి కోచ్‌ పదవికి ఒప్పించారనే చర్చ సాగుతోంది.. ఇక, గంగూలీ అంతలా చెప్పండంతో మిస్టర్‌ డిపెండబుల్‌ కూడా కాదనలేకపోయారట.. గత నాలుగేళ్లుగా ద్రవిడ్‌‌ని కోచ్‌గా ఒప్పించేందుకు మూడు సార్లు బీసీసీఐ పెద్దలు ప్రయత్నించినా.. ఎట్టకేలకు శుక్రవారం ఆ చర్చలు ఫలించాయి.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్.. అండర్-19 వరల్డ్‌కప్‌లో కోచ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల శ్రీలంక టూర్‌లోనూ టీమిండియాకి హెడ్ కోచ్‌గా ఉన్నారు.. ఇక, టీ20 వరల్డ్‌ కప్‌ ముగియగానే.. ఆయన భారత పురుషుల క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.. మరోవైపు.. బౌలింగ్ కోచ్‌గా ఆర్. శ్రీధర్ స్థానంలో పరాస్ కావాలని ద్రవిడ్‌ కోరడం.. దాదా వెంటనే అంగీకారం తెలపడం జరిగిపోయాయి.. అయితే, బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్ కొనసాగనున్నారు.. ఇక, రాహుల్‌ ద్రవిడ్‌కి 10 కోట్ల రూపాయల సాలరీని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. 2023 వరల్డ్ కప్ ముగిసే వరకు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నారు. ఓ సీనియర్‌ బీసీసీఐ అధికారి జాతీయ మీడియాకు తెలిపారు.

Related Articles

Latest Articles