తెరాస జిల్లా అధ్యక్ష పదవుల కోసం రేస్…

చాలాకాలం తర్వాత టీఆర్ఎస్‌లో పార్టీ పదవుల నియామకం జరగబోతుంది. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో నేతల మధ్య రేస్‌ కూడా మొదలైంది. ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్‌ చేస్తున్నారట. అధినేత ఫ్రేమ్‌లో పట్టేది ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇంతకీ ఏంటా పదవులు. ఎందుకంత డిమాండ్‌? లెట్స్ వాచ్‌!

టీఆర్ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవుల కోసం రేస్‌..!

సెప్టెంబర్ 2న జెండా పండుగతో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మొదలు పెట్టింది టీఆర్ఎస్. ఈ నెల 20లోపు గ్రామ, మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత జిల్లా కమిటీల అధ్యక్షులను ప్రకటించాలన్నది ఆలోచన. చాలాకాలం తర్వాత జిల్లా అధ్యక్షులను నియమిస్తుండటంతో పార్టీలో ఈ పదవుల కోసం రేస్ మొదలైంది. ఏదో ఒక పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్న వారు.. ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవైనా దక్కించుకుందామన్న ఆలోచనతో పావులు కదుపుతున్నారట. తమకు తెలిసిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో గట్టిగానే లాబీయింగ్‌ చేస్తున్నారట.

గులాబీ దళపతి కేసీఆర్‌ దగ్గర పూర్తి వివరాలు!

కొత్తగా ఏర్పాటైన జిల్లాల ప్రకారం అధ్యక్షుల పేర్లు ప్రకటిస్తారు. కొన్ని జిల్లాల్లో ఈ పోస్ట్‌ కోసం ఇద్దరు ముగ్గురు పోటీ పడుతుంటే.. మరికొన్నిచోట్ల ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉందట. వారిలో ఎవరికి పార్టీ పదవి దక్కుతుంది? పార్టీ అధ్యక్షులను చేయడానికి గులాబీ దళపతి తీసుకుంటున్న ప్రాతిపదికలేంటి? టీఆర్ఎస్‌ పరంగా ఎలాంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు? ఈ అంశాలు గులాబీ శిబిరంలో ఉత్కంఠ రేపుతున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏంటి? ఎవరెలా పనిచేస్తున్నారన్నది సీఎం కేసీఆర్‌ దగ్గర పూర్తి వివరాలు ఉంటాయని పార్టీ వర్గాల అభిప్రాయం. ఒకవేళ పదవి కావాల్సి వచ్చినా నేరుగా వెళ్లి సీఎంను కోరే అవకాశం ఉండదు. పలానా వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిని చేయాలని అనుకుంటే.. గులాబీ దళపతి ఫ్రేమ్‌లోకి ఇంకొకరు వచ్చే ఛాన్స్‌ లేదు.

జిల్లా అధ్యక్షుడైతే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఛాన్స్‌ ఉంటుందా?

టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శులతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ నిర్వహించిన సమావేశంలో ఈ దిశగా కొంత చర్చ జరిగినా.. జిల్లా అధ్యక్షులపై అంతిమంగా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పేశారు. అయితే పార్టీ పదవులను తమవారికే ఇప్పించుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో పోటీ ఇంకా ఎక్కువైంది. ఇదే సమయంలో పార్టీ వర్గాల్లో ఇంకో చర్చ మొదలైంది. ఇప్పుడు టీఆర్ఎస్‌ జిల్లా అధ్యక్షుడైతే.. రేపటి రోజున ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోతే ఎలా అన్నది కొందరి ప్రశ్న. అప్పుడు రాజకీయం ఎలా ఉంటుందో ఏమో.. ఇప్పటికైతే జిల్లా అధ్యక్షుడైతే చాలు అన్నది ఇంకొందరి ఆలోచన.

20 తర్వాత వచ్చే ప్రకటనపై ఉత్కంఠ

20 తర్వాత జిల్లా టీఆర్ఎస్‌ అధ్యక్షుల ప్రకటన ఉంటుంది. జిల్లాల్లో చాలా మంది పోటీ పడుతున్నా.. బాస్‌ దృష్టిలో ఎవరు ఉన్నారు అన్నది ప్రశ్నే. అందుకే అందరి దృష్టీ తెలంగాణ భవన్‌ నుంచి వచ్చే ప్రకటనపై నెలకొంది. మరి.. గులాబీ బాస్‌ ఎవరిని పికప్‌ చేస్తారో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-