అందని హుజురాబాద్‌ ఓటరు నాడి!

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కౌంట్‌ డౌన్‌ మొదలైంది. ఆక్టోబర్‌ 30కి ఇంకో పక్షం రోజులే ఉంది. దాంతో ప్రచారం రోజు రోజుకు ఉదృతమవుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ గెలుపు కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాయి. గడగడపకు వెళ్లి ఓటర్లకు తమ వాదన వినిపిస్తున్నారు. ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.అయితే ఓటర్లు చాలా తెలివైన వారు కదా.. అందుకే ఎవరు ఏం చెప్పినా సైలెంట్‌గా తల ఊపు ఊరుకుంటున్నారు. ఎవరు గెలుస్తారని అడిగితే ఓ నవ్వు నవ్వి ఊరుకుంటున్నారు. ఆ నవ్వులకు అర్థం ఏమిటో తెలియక నేతలు జుత్తు పీక్కుంటున్నారు.

దాదాపు నాలుగు నెలలుగా హుజూరాబాద్‌లో అనధికార ఎన్నికల ప్రచారం జరుగుతోంది. బహూశ ఇంత సుదీర్థ ప్రచారాన్ని ఇప్పటి వరకు మనం ఏ ఉప ఎన్నికలకు చూసి ఉండము. ఈ సంవర్భంలో నేతల దృష్టంతా హుజూరాబాద్‌ ఓటరు మీదే ఉంది. దానిని వారు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తల జంపింగ్‌లు.. అధికారుల హంగామా, అభివృద్ధి పనులకు శ్రీకారాలు, సబ్సిడీలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు, కౌంటర్లు ఇలా ఒకటేమిటి. ఇవన్నీ గత మూడు నెలలుగా నియోజకవర్గ ప్రజలకు బోలెడు వినోదాన్ని పంచుతున్నాయి.

రెండు లక్షల ఇరవై ఐదు వేల ఓటర్లు ఉన్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఈటల రాజేందర్‌ కేంద్రంగా జరుగుతోంది. అందుకే కేసీఆర్‌ దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పరిస్థితి నువ్వా నేనా అన్నట్టు మారింది. అందుకే ఈ పోరులో గెలుపు ఎవరిదో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. మొదట్లో ఈటల పట్ల విపరీతమైన సానుభూతి ఉండేది. ఐతే, ఎన్నికల ప్రకటన ఆలస్యం కావడంతో సానుభూతి పవనాలు బలహీనపడ్డాయి. మరోవైపు, టీఆర్‌ఎస్‌ తన అభివృద్ధి పథకాలతో ఈ ఎన్నికల స్వరూపాన్నే మార్చేసిందన్నది కొందరి అభిప్రాయం. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ నాయకుల నోటి నుంచి ఇలాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్, ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు నేతృత్వంలో గులాబీ దళం మొదటి నుంచి అగ్రెసివ్‌గా ప్రచారం చేస్తోంది. స్థానిక నేత, కాంగ్రెస్‌ నుండి టీఆర్‌ఎస్‌ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి టీఆర్‌ఎస్‌కు తోడయ్యారు. దీంతో ఈటల రాజేందర్‌కు బలమైన కౌంటర్ క్యాంపెయిన్ జరగుతోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ ..ఈ మూడు పార్టీలకు రాజకీయంగా ఇది చాలా ముఖ్యమైన ఎన్నిక. 2023 వరకు ఎన్నికలు లేనందున హుజూరాబాద్‌లో గెలుపు ఓటములు ఈ పార్టీల భవిష్యత్‌ను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి.

ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ ..బలమైన ఈటల రాజేందర్‌ను ఢీకొంటున్నారు. ఇక మరో ప్రధాన పక్షం కాంగ్రెస్ ప్రభావం ఈ ఎన్నికలపై ఎంత వరకు ఉంటుందనే దానిపై రాబోవు రోజుల్లో ఒక అంచనా ఏర్పడుతుంది. నిజానికి ఇక్కడ బీజేపీకి పెద్దగా స్థానం లేదు. అందుకే ప్రజలు దీనిని కేసీఆర్‌, ఈటల మధ్య పోరుగా చూస్తున్నారు. రాజేందర్‌కి కేసీఆర్ అన్యాయం చేశారనే అంశం ఇప్పటికే ప్రజల్లోకి బలంగా వెళ్లినట్టు కనిపిస్తోంది. ఈటలను అంత హడావుడిగా తొలగించటాన్ని హుజూరాబాద్‌ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేశారని హుజూరాబాద్‌ ప్రజానీకం బలంగా నమ్ముతోంది. టీఆర్ఎస్ ధన బలానికి, రాజేందర్ ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా బిజెపి నాయకులు ఈ ఉప ఎన్నికను అభివర్ణిస్తున్నారు.

ఈటల ప్రచార సభలలో మహిళలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ఆయనకు హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్న దృశ్యాలను మనం చూడొచ్చు. పెద్దవారు ఆయనను ఆశీర్వదిస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తాయి. అంతే కాదు పెద్ద సంఖ్యలో ముస్లిం మద్దతుదార్లు ఈటల ప్రచారంలో పాల్గొంటున్నారు. పాదయాత్రలు, బైక్ ర్యాలీల్లో వారు బీజేపీ జెండా పట్టుకుని టీ-షర్టులు, టోపీలు ధరించి చురుకుగా ప్రచారం చేస్తున్నారు. తాము రాజేందర్‌ కోసం ప్రచారం చేస్తున్నామని.. బీజేపీ కోసం కాదని కొందరు అంటున్నారు. నియోజకవర్గంలో పలు చోట్ల బీజేపీ కార్యకర్తలు కుంకుమ బొట్టు పెట్టుకుని ‘జై తెలంగాణ’ జై శ్రీ రామ్ ‘ అని కలిపి నినదిస్తున్నారు.

మరోవైపు, మంత్రి హరీష్‌ రావు హుజూరాబాద్‌ పట్టణంతో పాటు పొరుగు గ్రామాల ప్రజలకు నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. కాంగ్రెస్ , బిజెపి నుంచి పలువురు గులాబీ పార్టీలో చేరేవారికి స్వాగతం పలుకుతున్నారు. ఈ ఎన్నికల్లో సెంటిమెంట్ లేదు ..ఉండే అవకాశం కూడా లేదన్నది హరీష్‌ వాదన. కేసీఆర్‌ తెలంగాణ కోసం రాజీనామా చేసినట్టు రాజేందర్ రాజీనామా చేయలేదు. కేవలం తన స్వార్థం కోసం చేశారని ఓటర్లకు పదే పదే చెపుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రచారంలోనే ఉంటున్నారు.

రాజేందర్‌ను గెలిపిస్తే ఒరిగేదేమిటి? ఆయన గెలిస్తే ఏమవుతుంది..అసెంబ్లీలో ముగ్గురు సభ్యులున్న ఓ పార్టీలో టీమ్‌లో సభ్యుడవుతారు. అంతకు మించి ఏమీ అవదు. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే వల్ల మీ ప్రయోజనాలు చేకూరుతాయా? మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా అని ఓటర్లకు నూరిపోస్తున్నారు హరీష్‌. అంతెందుకు బీజేపీ కేంద్రంలో..టీఆర్‌ఎస్ రాష్ట్రంలో ఏడేళ్ల నుంచి అధికారంలో ఉన్నాయి. ఎవరి పాలన ఎలా వుందో పోల్చి చూసుకోండి మీకే విషయం అర్థమవుతుంది అంటూ నిర్ణయం ఓటర్లకే వదిలేస్తున్నారాయన. దీంతో ఓటరు ఆలోచనలో పడతారన్నది గులాబీ నేతల ఆశ. మొత్తం మీద హరీష్‌ రావు తన లాజిక్‌తో ఓటర్లను బుట్టలో పడేయాలని ప్రయత్నిస్తున్నారు. రాజేందర్ మాత్రం తన ప్రచారంలో సెంటిమెంట్‌నే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

యువనేత డాక్టర్ బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. వైద్య విద్య అభ్యసించారు. హుజూరాబాద్‌కు ఆయన స్థానికేతరుడు, పెద్దపల్లి నివాసి. యాదవ్ లాగే, డాక్టర్ వెంకట్ పార్టీ విద్యార్థి విభాగం, నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్‌ ప్రచార హడావుడి పెద్దగా లేదు. కానీ, ఆయన కటవుట్లు, జెండాలు మాత్రం కనిపిస్తాయి. కానీ ఇప్పటి వరకు ఓటర్లతో ఈయన పెద్దగా మమేకం కాలేదు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించటంలో జరిగిన ఆలస్యమే దీనికి కారణం అనుకోవచ్చు.

ఏదేమైనా, హుజూరాబాద్‌లో ముక్కోణ పోటీ జరగబోతోంది. కాంగ్రెస్ మొదటి నుంచి ఇక్కడ బలంగా ఉందని హస్తం పార్టీ మద్దతుదారులు అంటున్నారు. అయితే వారి ప్రచార వాహనం చూపరులను అంతగా ఆకట్టుకోవటంలేదు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి కనీసం నియోజకవర్గంలోని 102 గ్రామాల పేర్లు కూడా తెలియదని ఆయన ప్రత్యర్థులు..టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఎద్దేవా చేస్తున్నారు.

చివరగా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ఓటర్లను అడిగితే సమాధానం దాటవేస్తున్నారు. మరికొందరైతే తిరిగి అదే పశ్నను అడిగిన వారికి వేస్తున్నారు. అదన్నమాట సంగతి!!
Dr. Ramesh Babu Bhonagiri

-Advertisement-అందని హుజురాబాద్‌ ఓటరు నాడి!

Related Articles

Latest Articles