ప్రముఖ కన్నడ నటుడు శివరాం కన్నుమూత

కన్నడ సీని పరిశ్రమ మరోసారి విషాదంలో మునిగింది. ఈ మధ్య కాలంలో మరణించిన పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతి నుంచి కన్నడ ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కాగా తాజాగా మరోనటుడు మరణించిన వార్తను కన్నడ సీని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖ కన్నడ నటుడు శివరాం శనివారం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 83 ఏళ్ల శివరాం మంగళవారం రాత్రి తన నివాసంలో పూజా కార్యక్రమాలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకులారు. శివరాంను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆయన బ్రెయిన్‌ హెమరేజ్‌తో బాధపడుతున్నట్టు తెలిపారు. వయస్సు రీత్యా ఆయనకు సర్జరీ చేయలేమని వైద్యులు పేర్కొన్నారు. వారం కిందట శివరాంకు కారు ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి.

1938 జనవరి 28న జన్మించిన శివరాం 1958లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఆయన సీని కెరీర్‌ను ప్రారంభించారు. కేఆర్‌ సీతారామ శాస్త్రీ, పుట్టన్న కనగల్‌, సింగీతం శ్రీనివాసరావు వంటి అగ్ర దర్శకుల వద్ద శివరాం పనిచేశారు. 1965లో బెరత జీవ అనే చిత్రంతో నటుడిగాను తెరంగ్రేటం చేశారు. ఆపై సహాయనటుడిగాను శివరాం సత్తా చాటారు. 1972లో హృదయ సంగమ అనే చిత్రంతో శివరాం దర్శకుడిగా మారారు. కన్నడలో పలు సినిమాలు నిర్మించిన శివరాం రజనీకాంత్‌తో తమిళంలో ధర్మదురై అనే సినిమాను నిర్మించారు.

1985లో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘గిరఫ్తార్’ నిర్మించింది ఈయనే. ఇందులో ముగ్గురు స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్, కమల్​హాసన్, రజనీకాంత్ కలిసి నటించడం విశేషం. 2010-11 ఏడాదికిగాను డాక్టర్.రాజ్​కుమార్ లైఫ్​టైమ్ అచీవ్​మెంట్​ అవార్డును కర్ణాటక ప్రభుత్వం శివరామ్​కు బహుకరించింది. అలానే 2013లో పద్మభూషణ్ డాక్టర్ బీ.సరోజిని జాతీయ అవార్డు ఈయనను వరించింది. శివరామ్ మృతిపట్ల కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం కన్నడ చిత్రపరిశ్రమకు తీరని లోటుని ఆయన అన్నారు. శివరాం కన్నుమూయడంతో ఆయన అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన వారంతా శోకసంద్రంలో మునిగారు.

Related Articles

Latest Articles