కుప్పం - కుప్పం

2014 సాధారణ ఎన్నికలలో కుప్పం నియోజకవర్గం నుంచి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి , మాజీ ఐఏఎస్ అధికారి కె.చంద్రమౌళిపై 47121 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కె.శ్రీనివాసులుకు 2285 ఓట్లు వచ్చాయి. గతంలో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ కాలం పని చేసిన చంద్రబాబు తన రికార్డును తానే తిరగరాసుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రి కావడం ద్వారా కొత్త రికార్డు సృఫ్టించారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి ఆరుసార్లు వరుసగా గెలవగా, అంతకుముందు ఒకసారి చంద్రగిరిలో గెలుపొందారు. మొత్తం ఏడుసార్లు గెలిచిన నేతగా ఆయన నమోదయ్యారు. ఈసారి సభలో ఏడోసారి గెలిచిన వారు ఇద్దరే. వారిలో చంద్రబాబు ఒకరు, మరొకరు నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు.
1978లో రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించిన చంద్రబాబు, 1983నాటికి టిడిపిలోప్రవేశించి , అతి ముఖ్యమైన నేతగా ఎదిగారు. 1985లో పోటీ చేయనప్పటికి, కర్షకపరిషత్ చైర్మన్ గా ఉంటూ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగారు. 1989 నుంచి వరుసగా కుప్పంలో గెలుస్తున్నారు. 1999లో గెలిచాక ఎన్టీఆర్ క్యాబినెట్ లో కీలకమైన ఆర్ధిక, రెవెన్యూ శాఖలను ఆయన చేపట్టారు. అనంతరం రాజకీయ పరిణామాల కారణంగా ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసి ముఖ్యమంత్రి అయ్యారు.
సుదీర్ఘ కాలం 8ఏళ్ల 8నెలలకు పైగా ముఖ్యమంత్రి పదవిని నిర్వహించారు. 2004లో పార్టీ ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. రెండుసార్లు వరుసగా ప్రతిపక్ష నేతగా ఉండి.. 2014 సాధారణ ఎన్నికలలో గెలిచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. కుప్పం శాసనసభ నియోజకవర్గంలో టిడిపి ఇంతవరకు ఓడిపోని అతికొద్ది నియోజకవర్గాలలో ఒకటి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ గెలుస్తూనే ఉంది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు మాత్రమే గెలిచింది. సిపిఐ ఒకసారి గెలి్స్తే, ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా గెలుపొందారు. ఇక్కడ ఒకసారి గెలిచిన డి.రామబ్రహ్మం, పలమనేరులో మరోసారి గెలిచారు. ఇండిపెండెంటుగా డి.వెంకటేశం రెండుసార్లు గెలుపొందారు. టిడిపి నేత రంగస్వామినాయుడు రెండుసార్లు విజయం సాధించారు.