చంద్రగిరి - చంద్రగిరి

2014 సాధారణ ఎన్నికలలో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గంలో వైసిపి అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి గెలుపొందారు. చెవిరెడ్డి తన సమీప టిడిపి ప్రత్యర్ధి , మాజీ మంత్రి గల్లా అరుణపై 4518 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ విజయంతో చెవిరెడ్డి భాస్కరరెడ్డి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మాజీ మంత్రి గల్లా అరుణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపధ్యంలో కాంగ్రెస్ ను వదిలి టిడిపిలో చేరి ఇక్కడ నుంచి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కె.వేణుగోపాలరెడ్డికి 4808 ఓట్లు వచ్చాయి. గతంలో గల్లా అరుణ కాంగ్రెస్ తరపున నాలుగుసార్లు గెలవడమే కాకుండా వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లలో మంత్రిగా కూడా ఉన్నారు. గల్లా అరుణ తండ్రి రాజగోపాలనాయుడు గతంలో రెండుసార్లు తవనంపల్లె నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి, మరో రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇక చంద్రగిరి నియోజకవర్గం నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. ఆ తర్వాత మంత్రి, సిఎంగా, ప్రతిపక్షనేతగా, మరో సారి సిఎంగా పదవులను చేపట్టారు. 1989 నుంచి కుప్పంలో వరుసగా ఆరుసార్లు గెలిచారు. మొత్తం ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈయన సోదరుడు రామమూర్తినాయుడు కూడా చంద్రగిరిలో ఒకసారి గెలిచారు.