బండ్ల గణేశ్ విత్ డ్రా వెనుక కారణం వేరు: నిర్మాత యలమంచి రవిచంద్

‘ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ‘మా’ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పోటీ నుండి విరమించుకోవడానికి కారణం ఆయన అభిమాన దేవుడి సూచన కాద’ని నిర్మాత యలమంచి రవిచంద్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ”సినిమా రంగానికి చెందిన వేరే శాఖల కీలక పదవులలో ఉన్న వారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన ఉంది. ఆ కారణంగా బండ్ల గణేశ్ పోటీ నుండి విరమించుకున్నారు. కానీ ఆ నిజాన్ని చెప్పకుండా ఆయన ఏవేవో మాటలు చెబుతున్నారు” అని అన్నారు.

అలానే ‘ఒకప్పుడు నిర్మాతలను ఇబ్బంది పెట్టిన ప్రకాశ్ రాజ్ కు ‘మా’ అసోసియేషన్ షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చిందని, అప్పుడు ప్రకాశ్ రాజ్ చాలా ఏరొగెంట్ గా సమాధానమిచ్చారని తెలిసిందని, మరి అదే వ్యక్తి ఇప్పుడు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నిలబడుతుంటే, ఆ రోజుల్ని ఆర్టిస్టులు మర్చిపోయారేమో’ అనిపిస్తోందని యలమంచి రవిచంద్ చెప్పారు. అదే విధంగా ‘ఇటీవల పోసాని ఇంటిపై జరిగిన దాడిని నిర్మాతలంతా ఖండించారని నట్టికుమార్ ఎలా చెప్పారో తెలియడం లేదని, మా అందరి తరఫున మాట్లాడటానికి ఆయన ఎవరు!?’ ఎదురు ప్రశ్నించారు. ఇక ఏపీ ప్రభుత్వం విషయానికి వస్తే మంత్రి పేర్ని నాని గారు ఆ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పారని, అదే విధంగా సినిమా వాళ్ళకూ ఆయన సాయం చేయాలని కోరుకుంటున్నామని రవిచంద్ అన్నారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం మంచిదే కానీ దానికి సంబంధించిన నియమ నిబంధనలను తెలియచేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందని రవిచంద్ అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమా రంగం కోసం మోహన్ బాబు కుటుంబం ఎంతో సేవ చేసిందని, అలాంటి వారికి మద్దతు తెలపడంలో ఎలాంటి సందేహం ఉండక్కర్లేదని యలమంచి రవిచంద్ చెప్పారు.

-Advertisement-బండ్ల గణేశ్ విత్ డ్రా వెనుక కారణం వేరు: నిర్మాత యలమంచి రవిచంద్

Related Articles

Latest Articles