నిబద్ధత గల నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి!

(అక్టోబర్ 4న తమ్మారెడ్డి కృష్ణమూర్తి జయంతి)

ఇంతింతై వటుడింతై అన్నచందాన తమ్మారెడ్డి కృష్ణమూర్తి చిత్రసీమలో ఒక్కోమెట్టూ ఎక్కుతూ అభిరుచి గల నిర్మాతగా నిలిచారు. ఆరంభంలో ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తూ తరువాత నిర్మాతగా మారి, తెలుగువారిని అలరించే చిత్రాలు తెరకెక్కించారు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి నెలకొల్పిన ‘రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్’ పతాకంపై రూపొందిన చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. హైదరాబాద్ లో తెలుగు చిత్రపరిశ్రమ నెలకొనడానికి కృషి చేసిన వారిలో తమ్మారెడ్డి కృష్ణమూర్తి కూడా ఉన్నారు. కృష్ణమూర్తి చిత్రసీమకు చేసిన సేవలకు ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ లభించింది.

తమ్మారెడ్డి కృష్ణమూర్తి కృష్ణాజిల్లా ముదినేపల్లి సమీపంలోని చినపాలపర్రు గ్రామంలో 1920లో జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ తమ్మారెడ్డి కృష్ణమూర్తిలో అభ్యుదయ భావాలు మెండుగా ఉండేవి. ఉరకలు వేసే యువరక్తంతో స్వరాజ్య పోరాటంలోనూ పాలు పంచుకున్నారు. కమ్యూనిస్టు భావాలు ఆయనను బాగా ఆకర్షించాయి. ప్రజానాట్య మండలిలో చురుకుగా పాల్గొనేవారు. ఆ నాటి సంయుక్త మదరాసు రాష్ట్రంలో చెన్నపట్టణమే రాజధాని. మదరాసు చేరి తొలుత కొంతమంది సినిమా నటీనటుల పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు. తరువాత చిత్రసీమలో ప్రవేశించారు. యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘పల్లెటూరు’ చిత్రానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. ఆ పై సారథీవారి ‘రోజులు మారాయి’కి కూడా ప్రొడక్షన్ వ్యవహారాలు చూశారు. సారథీ అధినేత సి.వి.ఆర్. ప్రసాద్ కు కృష్ణమూర్తి మాటంటే ఎంతో గురి. తెలుగునేలపై స్టూడియో నిర్మించాలన్న ప్రసాద్ ఆలోచనకు కృష్ణమూర్తి కూడా సై అన్నారు. అలా హైదరాబాద్ లో సారథి సినీస్టూడియోస్ నిర్మాణం సాగింది. సారథి పతాకంపై యన్టీఆర్ హీరోగా రూపొందిన “కలసివుంటే కలదు సుఖం, ఆత్మబంధువు” చిత్రాలకు తమ్మారెడ్డి కృష్ణమూర్తి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఆ సినిమాల నిర్మాణ సమయంలోనే యన్టీఆర్ తో కృష్ణమూర్తికి అనుబంధం ఏర్పడింది. ఆయనతో సినిమా నిర్మించాలను కున్నారు. రామారావు కూడా డేట్స్ ఇవ్వడంతో ‘రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్’ పతాకంపై డి. వెంకటపతి రెడ్డితో కలసి ‘లక్షాధికారి’ చిత్రం నిర్మించారు కృష్ణమూర్తి. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ‘లక్షాధికారి’ మంచి విజయం సాధించింది. నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే కృష్ణమూర్తి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

తమ్మారెడ్డి కృష్ణమూర్తి హైదరాబాద్ వేదికగా చిత్రాలను నిర్మించసాగారు. అదే సమయంలో హైదరాబాద్ లోనే స్థిరపడ్డ ఏయన్నార్ తో ఆయన వరుసగా చిత్రాలు నిర్మించారు. తొలుత తమ బ్యానర్ పేరు ‘రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్’ ఉండగా, తరువాత తానే సోలో ప్రొడ్యూసర్ గా ‘రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్’ పతాకంపై చిత్రాలు నిర్మించారు. ఏయన్నార్ హీరోగా ఇదే పతాకంపై మొదట ‘జమీందార్’ చిత్రం తీశారు. ఆ తరువాత అక్కినేనితోనే ‘బంగారు గాజులు’ నిర్మించారు. ఆ పై ఏయన్నార్ తోనే ‘ధర్మదాత’ తెరకెక్కించారు. వరుసగా ఈ చిత్రాలు కమర్షియల్ సక్సెస్ సాధించాయి. ఏయన్నార్ తో రంగుల్లో ‘దత్తపుత్రుడు’ నిర్మించారు కృష్ణమూర్తి. ఈ చిత్రానికి ఆయన పెద్ద కుమారుడు లెనిన్ బాబు దర్శకత్వం వహించారు. ఈ సినిమాల తరువాత శోభన్ బాబుతో వరుసగా “సిసింద్రీ చిట్టిబాబు, డాక్టర్ బాబు, ఇద్దరు కొడుకులు” వంటి చిత్రాలు నిర్మించారు. శోభన్ బాబు, జయలలిత నటించిన ఏకైక చిత్రం ‘డాక్టర్ బాబు’ వీరు నిర్మించినదే. ‘డాక్టర్ బాబు’ మంచి విజయం సాధించింది. ‘ఇద్దరు కొడుకులు’ చిత్రంలోనే సత్యరాజ్ విలన్ గా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు.
“అమ్మానాన్న, చిన్ననాటి కలలు, లవ్ మ్యారేజ్” వంటి చిత్రాలనూ నిర్మించారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి. రెండు చిత్రాలు మినహాయిస్తే ఆయన చిత్రాలన్నిటికీ టి.చలపతిరావు సంగీతం సమకూర్చడం విశేషం. చలపతి రావు స్వరకల్పనలో రూపొందిన “లక్షాధికారి, జమీందార్, బంగారు గాజులు, ధర్మదాత, దత్తపుత్రుడు, సిసింద్రీ చిట్టిబాబు, డాక్టర్ బాబు” చిత్రాల్లోని పాటలు ఈ నాటికీ అలరిస్తూనే ఉండడం విశేషం.

తమ్మారెడ్డి కృష్ణమూర్తి మరో కుమారుడు తమ్మారెడ్డి భరద్వాజ తరువాత తండ్రి బాటలోనే పయనిస్తూ నిర్మాతగా మారారు. ఆపై దర్శకత్వమూ చేపట్టారు. కాలానుగుణంగా సినిమా రంగంలో చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా తమ్మారెడ్డి కృష్ణమూర్తి మళ్ళీ సినిమాలు తీయలేదు. అయితే తెలుగునాట చిత్రసీమ అభివృద్ధి కోసం కృషి చేశారు. 2007 సంవత్సరంలో తమ్మారెడ్డి కృష్ణమూర్తికి రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2013 సెప్టెంబర్ 16న తమ్మారెడ్డి కృష్ణమూర్తి తుదిశ్వాస విడిచారు.

-Advertisement-నిబద్ధత గల నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి!

Related Articles

Latest Articles