యూపీలో కాంగ్రెస్‌ కొత్త ప్లాన్‌.. శ్రీకారం చుట్టనున్న ప్రియాంక..

దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉంది.. పెద్ద రాష్ట్రం కావడం.. ఎక్కువ మంది ఎంపీలు ప్రానిథ్యం వహించే రాష్ట్రం కూడా కావడంతో.. జాతీయ పార్టీలు ఈ రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెడుతూ వస్తున్నాయి.. ఇక, స్థానిక ఎస్పీ, బీఎస్పీలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో అధికార పీఠాన్ని దక్కించుకొనేందుకు, బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్లాన్‌ చేస్తోంది కాంగ్రెస్‌ పార్టీ.. కొత్త వ్యూహాలతో ప్రజల ముందుకు వెళ్తోంది.. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు అప్పగించింది కాంగ్రెస్‌ పార్టీ.. ఆ తర్వాతే కాంగ్రెస్‌ కొత్త జోష్‌ వచ్చిందనేని పార్టీ శ్రేణులు, విశ్లేషకులు చెబుతున్న మాట.. ఇక, వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రతిజ్ఞా యాత్రల పేరు క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమైంది.

ప్రియాంక గాంధీ ప్రతిజ్ఞా యాత్రలను లాంఛనంగా ప్రారంభించనున్నారు.. మొదటి దశలో జరిగే మూడు ప్రతిజ్ఞా యాత్రలు వారణాసి, బారాబంకీ, శహరాన్‌పూర్‌ నుంచి ప్రారంభంకానున్నాయి.. ఇవాళ బారాబంకీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న ప్రియాంక గాంధీ.. ప్రతిజ్ఞా యాత్రలను లాంఛనంగా ఆరంభిస్తారు.. ఈ యాత్రలు నవంబర్‌ 1వ తేదీతో ముగియనున్నాయి.. ఇక, నాల్గో యాత్ర దీపావళి తర్వాత ప్రారంభం అవుతుందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.. ఈ యాత్రల ద్వారా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇవ్వనున్న హామీలను ప్రియాంక ప్రకటిస్తారనే ప్రచారం కూడా ఉంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు ఇస్తానని హామీ ఇప్పటికే ఇచ్చారు ప్రియాంక.. ఈ యాత్రలో మరికొన్ని హామీలు ప్రజల ముందు పెట్టబోతున్నారు.

మరోవైపు.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ప్రానితిథ్యం వహిస్తున్న నియోజకవర్గం వారణాసిలో భారీ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్‌ సత్తా చాటిన ప్రియాంకా గాంధీ.. ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్‌ చేస్తున్నారు.. తన నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా.. ఈ నెల 31వ తేదీన గోరఖ్‌పూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించేందుకు హస్తం పార్టీ సిద్ధం అవుతోంది.. ఈ ర్యాలీకి 2 లక్షల మందికి పైగా సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. మొత్తంగా ఈ సారి యూపీ ఎన్నికలు రసవత్తరంగా ఉండబోతున్నాయంటున్నారు విశ్లేషకులు.. ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్‌.. ఇంకా వైపు ఎస్పీ, బీఎస్పీ.. ఇలా యూపీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు.

Related Articles

Latest Articles