కాంగ్రెస్ చివరి అస్త్రం ప్రయోగించబోతుందా?

గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత రెండు పర్యాయాలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ ప్రభావం క్రమంగా అన్ని రాష్ట్రాలపై పడింది. దీంతో కాంగ్రెస్ క్రమంగా ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తుంది. ఇదే సమయంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావోరేవో అన్నట్లుగా మారింది. దీంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ సైతం ఛాలెంజ్ తీసుకుని పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో అందరి చూపు ఈ ఎన్నికలపై పడింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఈ అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల రిజల్ట్ ఎలా ఉంటుందనే ఉత్కంఠత అందరిలో నెలకొంది.

త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి సైతం పరీక్షలా మారిపోయాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉండగా వాటిని తిరిగి నిలబెట్టుకోవాల్సిన అవశ్యకత ఆ పార్టీకి ఉంది. ఒక్క రాష్ట్రంలో బీజేపీ ఓడినా ఆపార్టీపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. దీంతో బీజేపీ సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను సైతం మార్చే సాహసం చేస్తుంది. ఇక కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలని నిర్ధారించే రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ను రాజకీయ విశ్లేషకులు చూస్తుంటారు. దీనికి తగట్టుగానే అన్ని పార్టీలు ఇక్కడ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

ఉత్తరప్రదేశ్ లో జరిగిన గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. అత్యధిక పార్లమెంట్, అసెంబ్లీ సీట్లు ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నాయి. దీంతో అందరి చూపు ఉత్తరప్రదేశ్ పైనే ఉంది. బీజేపీ అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం బీజేపీని దెబ్బకొట్టాలని చూస్తున్నాయి. దీంతో ఈసారి బీజేపీకి ప్రతిపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురుకానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ తిరిగి తన పూర్వవైభవాన్ని సంతరించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది.

ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తన బ్రహ్మస్త్రంగా చెప్పుకుంటున్న ప్రియాంక గాంధీని ఎన్నికల బరిలో నిలుపుతోంది. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. తాజాగా ఆమె సారథ్యంలో కాంగ్రెస్ భారీ ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ప్రతిజ్ఙా యాత్ర పేరుతో ఆమె రాష్ట్రవ్యాప్తంగా 12వేల కిలోమీటర్లు తిరగనున్నారు. ఈ యాత్ర ఈ నెల 20వ తేదీన ఆరంభం కానుందని సమాచారం. ఈ యాత్ర పేరుతో ప్రియాంకా గాంధీ ప్రతీ మారుమూల గ్రామాన్ని కూడా పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగుతుందని ఆపార్టీ ప్రకటించింది.

ఈ ఎన్నికల్లో సత్తాచాటడం ద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈనేపథ్యంలో ప్రియాంక గాంధీని కాంగ్రెస్ ముందుంచినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా కాంగ్రెస్ కు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కీలకంగా మారయనేది మాత్రం వాస్తవం. ఎన్నో ఆశలతో బరిలో దిగుతున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఏమేరకు సత్తాచాటుతుందో వేచిచూడాల్సిందే..!

Related Articles

Latest Articles

-Advertisement-