యూపీలో ప్రియాంకం ఎవరికి లాభం…?

కొద్ది రోజుల నుంచి ఉత్తర ప్రదేశ్‌లో మార్మోగుతున్న పేరు..ప్రియాంకా గాంధీ. హింసాకాండ జరిగిన లఖింపూర్ వెళుతుండగా మార్గ మధ్యలో సీతాపూర్‌ వద్ద యూపీ పోలీసులు ఆమెను ఆదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆమెను ఉంచిన గెస్ట్ హౌస్‌ గదిని చీపురు పట్టి ఆమే శుభ్రం చేసుకున్నారు. అదే సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తరువాత సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి లఖింపూర్ వెళ్లారు. శుక్రవారం స్థానిక వాల్మీకి కాలనీలో మళ్లీ చీపురుతో కనిపించారు. ఈసారి ఆమె రోడ్డు ఊడ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో ఆదివారం మెగా ర్యాలీకి ప్లాన్ చేశారు. ఇదంతా చూస్తుంటే ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ పునరుజ్జీవం కోసం చేస్తున్న ప్రయత్నమని అనిపించవచ్చు.

యూపీ రాజకీయాలలో ప్రియాంకని ఎక్కువ చేసి చూపించటాన్ని బీజేపీ పెద్దగా పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో ప్రియాంక ఫ్యాక్టర్‌ ఉంది అనేలా చేయటం కూడా బీజేపీ వ్యూహాత్మక వ్యూహమేనా అనిపిస్తుంది. ఎందుకంటే..ఇక్కడ బిజెపి ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు సమాజ్‌వాది పార్టీ , బిఎస్‌పిలు.. ఓటు బేస్‌ లేని కాంగ్రెస్‌ ప్రభావం ఎన్నికల్లో ఉండదని బావిస్తున్నాయి. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని అవి ఇప్పటికే తెగేసి చెప్పాయి. అయితే ప్రియాంక ఫ్యాక్టర్‌తో రాష్ట్రంలో కాంగ్రెస్ ఓట్లు కొద్దొ గొప్పో పెరిగినా దాని వల్ల ఎస్పీ, బీఎస్పీలకే నష్టం కలుగుతుందన్నది బీజేపీ ఎత్తుగడలా కనిపిస్తోంది.

నిజానికి 2014, 2017, 2019లో జరిగిన ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌ లోని అగ్ర వర్ణ కులాలు, ముస్లింలు కొంత వరకు కాంగ్రెస్‌కు ఓటేశారు. అయితే ప్రభావం చూపే స్థాయిలో లేరు. ఇప్పుడు అగ్రవర్ణ ఓటర్లు బీజేపీరి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. పలు కారణాల వల్ల అగ్రవర్ణాలు.. ముఖ్యంగా బ్రాహ్మణులు బీజేపీకి దూరం కావచ్చని ఆ పార్టీ కలత చెందుతోంది. వారు తమకు ఓటు వేయని పక్షంలో ఎస్‌పి, బిఎస్‌పికి కాకుండా కాంగ్రెస్‌ వైపు వెళ్లేలా చూసేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నంలా ఇది కనిపిస్తోంది. అలాగే ముస్లింలు ఓట్ల చీలికకు కూడా ప్రియాంక ఫ్యాక్టర్ పనికి వస్తుంది. అందుకే ఆమెకు యూపీలో స్పేస్‌ కల్పించటం బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది.

బీఎస్‌పీ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ లఖింపూర్‌ హింసాకాండలో చనిపోయిన బ్రాహ్మణ కుటుంబాలను ఎందుకు పరామర్శించ లేదని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. ఆ మాటల వెనక పరమార్థం కూడా అగ్రవర్ణ ఓటర్లే. ప్రియాంక చీపురు పట్టటంపై కూడా ఆయన చవకబారు కామెంట్‌ చేశారు. ప్రజలు ఆమెను అక్కడికి దిగజార్చారని వ్యాఖ్యానించటం ఆమె స్థాయిని కాదు ఆయన స్థాయిని తగ్గించిందంటోంది కాంగ్రెస్. యోగీ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు కూడా దిగుతోంది. దళితులు, మహిళలను ముఖ్యమంత్రి అవమానించారంటూ రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

ఏదేమైనా, లఖింపూర్ ఎపిసోడ్‌లో ఎస్‌పి,బిఎస్‌పి రెండూ వెనుకబడినట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఎపిసోడ్‌ని బిజెపి,కాంగ్రెస్ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటూ ఈ పార్టీలకు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. సీతాపూర్ వరకు ప్రియాంకను ఎలా అనుమతించారు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు అఖిలేష్‌ని కనీసం తన నివాసం నుండి బయటకు వెళ్లడానికి కూడా అనుమతించలేదు అలాంటి ప్రియాంకను ఎందుకు ముందే అడ్డుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కానీ..కాంగ్రెస్‌ బలం పుంజుకుంటే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అది బీజేపీని కూడా దెబ్బతీస్తుందా ..లేదంటే కేవలం ఎస్పీ , బీఎస్పీలకే నష్టం కలిగించటానికే పరిమితమవుతుందా?

చరిత్రను చూస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో యూపీకి ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ రాజకీయాల్లో ప్రవేశించారు. రాహుల్ గాంధీతో లక్నోలో పెద్ద రోడ్ షో నిర్వహించారు. ఎస్‌పి-బిఎస్‌పి-ఆర్‌ఎల్‌డి ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయగా కాంగ్రెస్ ఒంటరిగా పోరాడింది. ప్రతిపక్ష కూటమి 80 సీట్లలో 15 సీట్లను మాత్రమే గెలుచుకోగా, కాంగ్రెస్ రాహుల్ గాంధీ పోటీ చేసిన అమేథిని కూడా కోల్పోయింది. రాయ్ బరేలీలో మాత్రం సోనియా గాంధీ గెలిచారు.

అయితే, ఆ ఎన్నికల ద్వారా కీలక లెక్కలు బిజెపికి తెలిసొచ్చాయి. దాదాపు 10 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌ కారణంగా ఎస్‌పి-బిఎస్‌పి-ఆర్‌ఎల్‌డి కూటమి కోల్పోయింది. ఎందుకంటే ఈ స్థానాల్లో బిజెపి అభ్యర్థుల గెలుపు మార్జిన్లు కాంగ్రెస్ అభ్యర్థుల ఓట్ల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ కేవలం ఒక సీటు మాత్రమే గెలిచి ఉండవచ్చు. పోటీ చేసిన స్థానాల్లో చాలా వరకు డిపాజిట్లు కోల్పోయి వుండవచ్చు. కానీ కీలకమైన ఓట్లు సాధించి ప్రత్యర్థి కూటమిని బాగా దెబ్బతీసింది. తమ పార్టీ కొద్దో గొప్పో సీట్లు సాధిస్తుందని ప్రియాంక అనుకున్నారు..కానీ ఆమె ప్రచారం పరోక్షంగా చివరకు బీజేపీకే లాభించిందని ఫలితాలు నిరూపించాయి. బహుశా 2022లోనూ అది పునరావృతం అవుతుందని బీజేపీ ఆశ కావచ్చు.

2012 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 28 సీట్లు గెలిచింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పనితీరును మెరుగుపరచడానికి రాహుల్ గాంధీ .. బాలకోట్ దాడులు జరగడానికి ముందు రాష్ట్రవ్యాప్తంగా ఖాట్ యాత్ర చేశారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంది. అయినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఏడు స్థానాలకు పడిపోయింది. సంస్థాగతంగా యూపీలో బిజెపి బలమైన ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ ‘వెనక్కి తగ్గినట్లు’ కనిపిస్తే .. బలహీనమైన కాంగ్రెస్ అత్యంత దూకుడుగా కనిపిస్తుంది. ఈ దూకుడు 2022 ఎన్నికల్లో ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాల్సివుంది.

— Dr. Ramesh Babu Bhonagari

-Advertisement-యూపీలో ప్రియాంకం ఎవరికి లాభం...?

Related Articles

Latest Articles