అప్ఘనిస్తాన్ లో కిలో బంగాళదుంపలు @ రూ.3వేలు

అప్ఘనిస్తాన్ పై తాలిబాన్లు దురాక్రమణ చేయడంతో అక్కడి పరిస్థితులన్నీ రోజురోజుకు దిగజారిపోతున్నాయి. అప్ఘన్లో తామే ప్రభుత్వాన్ని నడిపిస్తామని ప్రకటించుకున్న తాలిబన్లు ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో దారుణంగా విఫలమవుతున్నారు. దీనికితోడు షరియా చట్టాలను కఠినంగా అమలు చేస్తామని ప్రకటించడంతో తాలిబన్లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అయితే గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్ఘన్లు అక్కడ బ్రతుకు జీవుడా అంటూ జీవిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరినీ తాలిబన్లు కిడ్నాప్ చేస్తారో? ఎవరిపై కాల్పులు జరుపుతారో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

కనీసం దేశం విడిచి పారిపోదామనుకున్న వారికి పరిస్థితులు సహకరించడం లేదు. కాబూల్ ఎయిర్ పోర్టును స్వాధీనం చేసుకున్న తాలిబన్లు విమాన రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు ఇతర దేశాలతో ఉన్న నగరాల సరిహద్దులను సైతం మూసివేశారు. దీంతో అప్ఘన్లు ఎటూ వెళ్లలేని దుస్థితి నెలకొంది. సరిహద్దు దేశాలు సైతం భూభాగాలను మూసివేశారు. దీంతో సరిహద్దుల్లోనే లక్షలాది అఫ్ఘన్లు శరణార్థులుగా మిగిలిపోయారు.. మరోవైపు దేశంలో ఆకలి కేకలు రాజ్యమేలుతున్నాయి. తొందర్లోనే ఆ దేశంలో 2కోట్లకు పైగా జనాభాకు తిండి దొరకని పరిస్థితి ఉంటుందని 15రోజుల క్రితమే ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం దేశంలోని పరిస్థితులన్నీ చూస్తుంటే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. అప్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకొని నెలరోజులు గడిచిపోయింది. అప్పటి నుంచి దేశంలోని పరిస్థితులన్నీ రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కనీసం మూడుపూటలు కుటుంబ సభ్యులకు తిండిపెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో అప్ఘన్లు తమ ఇళ్లలోని వస్తువులన్నింటిని రోడ్లపైకి తీసుకొచ్చి వచ్చిన ధరకు అమ్ముకుంటున్నారు. ఈ కారణంగా కాబుల్ లో ఎక్కడ చూసినా రోడ్లపై ఇళ్లలోని వస్తువులే దర్శమనిస్తున్నాయి. అయితే అందరి ఇళ్లలోనూ పరిస్థితి ఒకేలాగా ఉండడంతో ఎవరు కూడా కొనుగోళ్ల చేయడం లేదని తెలుస్తోంది.

ఒకరిద్దరు కొనుగోలు చేసినా చాలా తక్కువ ధర ఇస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష రూపాయాలు ఖరీదు చేసే వస్తువులు అక్కడ కేవలం 10వేలకే లభిస్తున్నాయి. 25వేల విలువ చేసే రిఫ్రిజరేటర్లు, టీవీలు కూడా 5వేలలోపే అమ్ముతున్నారు. కేవలం కుటుంబాన్ని పస్తులు ఉంచలేక అప్ఘన్లు ఇంత తక్కువ ధరకు వస్తువులను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అప్ఘన్లో ఆహార నిల్వలు తగ్గిపోవడంతో నిత్యావసర ధరలకు రెక్కలొచ్చాయి. ఓ మాదిరి ధనిక కుటుంబం సైతం కిలో బంగాళ దుంపలు కొనలేని పరిస్థితి ఉంది.

కిలో బంగాళా దుంపలు మన కరెన్సీలో మూడు వేల రూపాయలకు లభిస్తున్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొనుగోలు చేయక తప్పడం లేదని తెలుస్తోంది. బయటి నుంచి ఆహార దిగుమతులు లేకపోవడంతో నిత్యావసర ధరలు రోజురోజుకు మరింత పెరిగిపోతున్నాయి. మరోవైపు బ్యాంకులు సైతం సరిగ్గా పని చేయకపోవడంతో డబ్బుల కోసం జనాలు అల్లాడుతున్నారు.. తమను ఆదుకోవాలని అప్ఘన్లు ప్రపంచ దేశాలను కన్నీటితో వేడుకుంటున్నారు. ఏదిఏమైనా పెట్రోల్ ధర మనదేశంలో వంద పెరిగితే వామ్మో అంటున్న జనం.. అప్ఘన్ల దీన పరిస్థితిని చూస్తే అయ్యో అనకమానరు. ఏదిఏమైనా అప్ఘన్ల గోస పగోడికి కూడా రావద్దని కోరుకుందాం.

-Advertisement-అప్ఘనిస్తాన్ లో కిలో బంగాళదుంపలు @ రూ.3వేలు

Related Articles

Latest Articles