షర్మిలతో పీకే టీం భేటీ.. టార్గెట్ ఫిక్స్ అయిందా?

వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టిన సంగతి అందరికి తెల్సిందే. ఆమె స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఇప్పుడిప్పుడే ప్రజల్లో గుర్తింపు దక్కుతోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యమని ప్రకటించిన షర్మిల ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ప్రారంభించిన ఆరునెలల్లో తెలంగాణ ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగ సమస్య, యువత ఆత్మహత్యలు, రైతు సమస్యలపై గళం విప్పుతున్నారు. యువత నుంచి షర్మిలకు ఎక్కువగా మద్దతు లభిస్తుంది. దీంతో ఆ వర్గాన్ని పూర్తిగా తనవైపు తిప్పుకునేలా ఆమె ప్లాన్ చేస్తున్నారు.  

దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కూతురిగా షర్మిలకు తెలంగాణలో ప్రజాదరణ లభిస్తోంది. దీనినే ఆమె అస్త్రంగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ ప్రజలు గుర్తుకుతెచ్చేలా ఆమె పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. వచ్చే నెల 20 నుంచి ఏడాదికాలం పాటు ఆమె పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. తన తండ్రిలాగే షర్మిల సైతం చేవేళ్ల నుంచే పాదయాత్రను షూరు చేయనుండం విశేషం. ఇప్పటికే పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మినహా 90నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర కొనసాగనుంది.

వైఎస్ఆర్ అభిమానులను ఏకం చేసేలా ఆమె పాదయాత్ర ఉండనుందని తెలుస్తోంది. ఆయన ఇమేజ్ ను పూర్తిగా తన పార్టీకే దక్కేలా ఆమె పావులు కదుపుతున్నారు. వైఎస్ ను ఓన్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీని సైతం పాదయాత్ర వేదికగా ఆమె తూర్పార పట్టనున్నారని సమాచారం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర వైఫల్యాలను ఎండగట్టనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ సర్కారును టార్గెట్ చేసిన షర్మిలా కేంద్రంలోని బీజేపీని సైతం పాదయాత్ర వేదికగా ప్రశ్నించే అవకాశం కన్పిస్తోంది. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూనే బీజేపీ, టీఆర్ఎస్ సంబంధాలను ఆమె నిలదీసేందుకు రెడీ అవుతున్నారు. అదే సమయంలో పీసీసీ రేవంత్ ను సైతం టార్గెట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది.

తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బలంగా ఉన్నారు. వైఎస్ఆర్టీపీ ఇంకా క్షేత్రస్థాయిలో బలపడాల్సి ఉంది. ఈక్రమంలోనే ఇతర పార్టీలోని ముఖ్య నేతలను సైతం పార్టీలో చేర్చుకునేందుకు ఆమె వ్యూహాలు రచిస్తున్నారు. పాదయాత్రలో పలు పార్టీల నేతలు ఆమె సమక్షంలో కండువాలు కప్పుకునే అవకాశం ఉండనుందని సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ అభిమానులను తమవైపు తిప్పుకొని తెలంగాణలో రాజకీయ శక్తిగా ఎదగాలని ఆమె భావిస్తున్నారు. ఇక తమ రాజకీయ వ్యూహాకర్తగా ప్రశాంత్ కిషోర్ ను ఆమె నియమించుకున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీంతో ఆమెతో భేటి అయినట్లు తెలుస్తోంది.

త్వరలో చేపట్టనున్న పాదయాత్రలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. పాదయాత్ర రూట్ మ్యాప్ ఎలా ఉండాలి? ప్రజల్లోకి ఏయే అంశాలను తీసుకెళ్లాలి? ఎలాంటి హామీలు ఇవ్వాలనే వాటిపై ఆమెకు ప్రశాంత్ కిషోర్ టీం క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో బలంగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను ఎలా ఎదుర్కోవాలనే వాటిపై సుధీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీం జగన్ పాదయాత్రతో ఆయనను పాపులర్ చేసింది.. రాజకీయ అధికారం కట్టబెట్టింది. అదే టీం ఇప్పుడు తెలంగాణలో షర్మిలతో నడవనుంది. ఈ పాదయాత్రలో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని ఎన్నికల మేనిఫోస్టోను సిద్ధం చేయనున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్న షర్మిలకు త్వరలో చేపట్టబోయే పాదయాత్ర ఎలాంటి ఫలితం ఇస్తుందనేది ఆసక్తిని రేపుతోంది.

-Advertisement-షర్మిలతో పీకే టీం భేటీ.. టార్గెట్ ఫిక్స్ అయిందా?

Related Articles

Latest Articles