ఏపీలో పీకే టీం.. టార్గెట్ ఏంటంటే?

ఏపీలో పీకే టీం రంగంలోకి దిగిందా? అంటే అంతా అవుననే సమాధానమే విన్పిస్తుంది. గడిచిన రెండ్రోజులుగా పీకే టీం విశాఖలో తిష్ట వేసినట్లు తెలుస్తోంది. స్థానికులు, ప్రజాప్రతినిధుల నుంచి పీకే టీం అభిప్రాయ సేకరణ చేపడుతుందనే టాక్ విన్పిస్తోంది. విశాఖలో ప్రస్తుతం ఆరాతీస్తుందట.. ఆ తర్వాత రాష్ట్రమంతటా వీరు సర్వే చేస్తారని తెలుస్తోంది. వీరి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని ఓ రిపోర్టును తయారు చేస్తున్నారట. దీంతో ఈ సర్వే ఎందుకు కోసం జరుగుతుందనే పలువురు ఆరా తీస్తున్నారు. అందరూ అనుకున్నట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుస్తు ఎన్నికలు వెళుతారా? లేదంటే మరేదైనా కారణాలు ఉన్నాయనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది.    

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ రాజకీయ వ్యూహాకర్తగా ప్రశాంత్ కిషోర్(పీకే) పని చేశారు. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ కుతోడు పీకే వ్యూహాలు బాగా పనిచేశాయి. టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత కూడా వైసీపీకి కలిసి వచ్చింది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ తుఫానులా కొనసాగడంతో ప్రతిపక్ష పార్టీల అడ్రస్ గల్లంతయ్యాయి. వైసీపీకి ఏకంగా 151 సీట్లు రాగా, టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. జనసేనకు ఒక్కటంటే ఒక్క సీటు మాత్రమే వచ్చింది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు పూర్తి కావొస్తుంది. ఈ రెండున్నరేళ్లలో ఆయన సంక్షేమ కార్యక్రమాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. దీంతో అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వం నుంచి ఏదోఒక లబ్ధి పొందుతూనే ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతీ ఎన్నికల్లోనూ వైసీపీనే విక్టరీ సాధిస్తూ వెళుతోంది. ప్రతిపక్షాలు కనీస పోటీ ఇవ్వడం లేదు. ప్రతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుంటే ప్రజలంతా ఆయన వెంటే ఉన్నట్లు కన్పిస్తుంది.

ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ అనంతరం మంత్రులతో ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మంత్రులంతా ఎన్నికల మూడ్లోకి వెళ్లాలని సూచించారని సమాచారం. ఇదే సమయంలో పీకే టీం త్వరలోనే ఏపీలో అడుగు పెడుతుందని వారితో కలిసి పని చేయాలని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.

ఆయన వ్యాఖ్యలకు తగ్గట్టుగానే తాజాగా పీకే టీం విశాఖలో పర్యటిస్తుంది. రెండ్రోజులుగా విశాఖలో తిష్టవేసి పలు అంశాలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. నేతల పనితీరు, ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు? అనే అంశాలపై సర్వే చేపట్టారు. అలాగే ప్రభుత్వ అధికారులు ప్రజలతో వ్యవహరిస్తున్న తీరుపై సైతం ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నామినేటేడ్ పదవులు ఆశించిన భంగపడిన నేతలు నిరుత్సాహంలో ఉన్నట్లు పీకే టీం గుర్తించిందని సమాచారం.  

కొందరికే పార్టీలో ప్రాధాన్యం దక్కుతుందని ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నవారికి గుర్తింపు ఇవ్వడం లేదని పలువురు బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. అదేవిధంగా పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి పీకేం టీం విశాఖ వేదికగా పలు రాజకీయ అంశాలపై ఆరా తీయడం హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం విశాఖకే పరిమితం అయిందా? లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుందా? అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి పీకేం టీం అనుకున్న సమయం కంటే ముందుగానే పని పెట్టడంతో ఏపీలో రాజకీయవేడి రాజుకోవడం ఖాయంగా కన్పిస్తుంది.

-Advertisement-ఏపీలో పీకే టీం.. టార్గెట్ ఏంటంటే?

Related Articles

Latest Articles