ప్రభాస్… హాలీవుడ్ హీరో అనిపించుకుంటాడా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు కమిట్ అయ్యాడు. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావటం విశేషం. ప్రభాస్ తరహాలో ఏ భారతీయ హీరో ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ విడుదలకు రెడీగా ఉంది. ఇక ‘సలార్’, ‘ఆదిపురుష్’ సెట్స్ మీద ఉన్నాయి. ఇవి కాక అశ్వనీదత్ బ్యానరులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఇవి కాకుండా ‘స్పిరిట్’ సినిమా కమిట్ అయ్యాడు. ‘ప్రాజెక్ట్ కె’లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ప్రభాస్‌కు జోడీగా నటిస్తుండగా కీలక పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకులే కాదు హాలీవుడ్ దర్శకులు కూడా ఆరాతీస్తున్న ఏకైక ఇండియన్ హీరో ప్రభాస్ అని స్పష్టం చేస్తున్నారు నిర్మాత అశ్వనీదత్. ‘ప్రాజెక్ట్ కె’ తరువాత ప్రభాస్ హాలీవుడ్ చిత్రాలకు పరిమితమైనా ఆశ్చర్యం లేదన్నది ఆయన కామెంట్.

‘బాహుబలి’ సిరీస్‌లో ప్రభాస్ ఆహార్యం.. స్క్రీన్ ప్రజెన్స్ అంతలా హాలీవుడ్ దర్శకుల్ని సైతం ముంత్ర ముగ్ధుల్ని చేసినట్లు సమాచారం. ప్రభాస్ ఓకే అంటే హాలీవుడ్ అదిరిపోయే ఆఫర్లు ఇవ్వటానికి పలువురు హాలీవుడ్ దర్శకులు ఆసక్తిని కనబరుస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అశ్వనీదత్ ఇదే విషయం స్పష్టం చేస్తున్నారు. ప్రభాస్ స్టార్ డమ్ పాన్ ఇండియా దాటింది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో హాలీవుడ్‌ను ప్రభావితం చేయటం గ్యారెంటీ అంటున్నారు. అయితే ప్రభాస్‌లో ఒక్కటే లోపం. షూటింగ్‌లో బాగానే కష్టపడతాడు. ఇక అతిథ్యం ఇవ్వటంలో ప్రభాస్‌ను మించిన వారు లేరు. అదే అతని కొంప ముంచుతోంది. దీని వల్ల ఫిజిక్ లో ఛేంజెస్ వస్తుంటాయి. వరుసగా గ్యాప్ వస్తే మనిషి షేప్‌లో భారీ తేడా వస్తుంది. ‘బాహుబలి’ తర్వాత ‘సాహో’లో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని కెరీర్‌ను నియమ నిబద్దతలతో కొనసాగిస్తే హాలీవుడ్‌లోనూ జెండా పాతటం ఖాయం. మరి ప్రభాస్ అంతలా జాగ్రత్తలు తీసుకుంటాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ.

Related Articles

Latest Articles