పవన్ కళ్యాణ్ పవర్!

(సెప్టెంబర్ 2తో పవన్ కళ్యాణ్ కు 50 ఏళ్ళు పూర్తి)

పవన్ కళ్యాణ్ – ఈ పేరు వింటే చాలు అభిమానుల మదిలో ఆనందం అంబరమంటుతుంది. నవతరం టాప్ స్టార్స్ లో అందరికంటే వయసులో సీనియర్ పవన్ కళ్యాణ్. అదే తీరున ఇతరుల కన్నా మిన్నగా పవన్ సినిమాలు వసూళ్ళు చూపిస్తూంటాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా పవన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. ఈ ప్యాండమిక్ లో ఫస్ట్ వేవ్ తరువాత ఈ యేడాదే ‘వకీల్ సాబ్’ గా వచ్చి అలరించారు పవన్. ఆయన తీరు చూస్తోంటే స్పీడు పెంచినట్టు కనిపిస్తోంది. ఓ వైపు ‘భీమ్లా నాయక్’ పూర్తి కావస్తోంది. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’గా నటిస్తున్నారు. ఇవి రెండు ఇంకా జనం ముందుకు రాకుండానే తనకు ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా ఆరంభించారు పవన్. కరోనా కల్లోలం లేకపోయివుంటే, పవన్ కళ్యాణ్ మరింత వేగంగా సినిమాలు చేసేవారేమోనని అంటున్నారు పరిశీలకులు. ‘జనసేనాని’గా తన చిత్రాలలో తమ పార్టీ ప్రణాళికలోని అంశాలను చొప్పిస్తూ ఉన్నారు పవన్. దాంతో ఇతర పార్టీలవారు సైతం పవన్ సినిమాలను చూసి, అందులో ఏవైనా లొసుగులున్నాయేమో పట్టేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ తొలుత అన్నచాటుతమ్ముడుగానే చిత్రసీమలో అడుగు పెట్టారు. తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’లోనే తనకు మార్షల్ ఆర్ట్స్ లో పట్టు ఉందని నిరూపించుకున్నారు. తరువాత పవన్ నటించిన “గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి” చిత్రాలు వరుస విజయాలు చూశాయి. వరుసగా ఏడు చిత్రాలు ఒకదానిని మించి మరోటి విజయం సాధించాయి. దాంతో పవన్ కళ్యాణ్ ‘పవర్ స్టార్’గా జనం మదిలో నిలచిపోయారు. పవన్ తన పవర్ మరింత చూపించడానికి అన్నట్టు కొన్ని సినిమాల్లో ఫైట్స్ కంపోజ్ చేశారు. తన అన్న చిరంజీవి నటించిన ‘డాడీ’లో ఆయనకే ఫైట్ మాస్టర్ గా పనిచేశారంటే పవన్ ఎంత దూకుడు చూపించారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎనిమిదవ చిత్రం ‘జానీ’తో దర్శకునిగా మెగాఫోన్ కూడా పట్టేశారు. అది కాస్తా ఫట్టు మంది. దాంతో మళ్ళీ దర్శకత్వం వైపు చూడలేదు పవన్. కానీ, తన ప్రతి చిత్రంలో వైవిధ్యం చూపించాలనే తపన మాత్రం ఆయనలో తగ్గలేదు.

‘ఖుషి’ తరువాత పవన్ నటించిన ఆరు చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి. ఆ సమయంలో పవన్ తో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘జల్సా’ బ్లాక్ బస్టర్ గా నిలచింది. తరువాత మళ్ళీ మామూలే అన్నట్టు మూడు ఫ్లాపులు పలకరించాయి. అప్పుడు హరీశ్ శంకర్ తన ‘గబ్బర్ సింగ్’తో గ్రాండ్ సక్సెస్ ను అందించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన రెండో సినిమా ‘అత్తారింటికి దారేది’ అదరహో అన్న స్థాయిలో అలరించింది. ఆ సినిమా తరువాత మళ్ళీ పవన్ ను ఆ స్థాయి విజయం పలకరించలేదు. త్రివిక్రమ్ తో పవన్ కలసి పనిచేసిన మూడో సినిమా ‘అజ్ఞాతవాసి’ అపజయాన్ని చవిచూపింది. మరోవైపు రాజకీయాల్లోనూ పరాజయమే పలకరించింది. దాంతో మూడేళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నారు. తాను ‘ప్రశ్నించే గళాన్ని’ అంటూ చాటుకొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. మళ్ళీ సినిమాల్లో నటించనని అన్నారు. కానీ, రాజకీయాల్లో చేరారు కదా! మాట మీద నిలబడలేకపోయారు. అభిమానులను అలరించే ప్రయత్నంగా మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. ఈ యేడాది ‘వకీల్ సాబ్’గా జనం ముందు నిలిచారు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’, “హరిహర వీరమల్లు’గానూ అలరించే ప్రయత్నం చేస్తున్నారు పవన్.

పవన్ కు ఆరంభంలో రీమేక్ మూవీస్ అచ్చివచ్చాయనే చెప్పాలి. “గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషి, గబ్బర్ సింగ్” వంటి సూపర్ హిట్స్ రీమేక్స్ ద్వారానే పవన్ ఖాతాలో చేరాయి. అలాగే కొన్ని రీమేక్స్ ఆయనకు చేదునూ రుచి చూపించాయి. అయినా, పవన్ రీమేక్స్ పైనే దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ‘పింక్’ రీమేక్ గా రూపొందిన ‘వకీల్ సాబ్’తో మళ్ళీ జనాన్ని పలకరించారు. మళయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ గా ఇప్పుడు ‘భీమ్లా నాయక్’లో నటిస్తున్నారు. మరి ఈ సారి పవన్ ఏ తీరున అభిమానులకు ఆనందం పంచుతారో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-