కరోనా వ్యాక్సిన్ కి Z+ సెక్యూరిటీ.. అదే భయం ?

కరోనా వ్యాక్సిన్ కి Z+ సెక్యూరిటీ.. అదే భయం ?

కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కౌంట్ డౌన్ మొదలైంది. జనవరి 16 నుంచి టీకా దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. వ్యాక్సిన్ భద్రపరిచిన శీతలీకరణ కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. జడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పిస్తున్నారు. వ్యాక్సిన్‌కు జీపీఎస్ ట్రాకింగ్‌ సిస్టంను అనుసంధానించారు. ఐతే..ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయే ప్రమాదం పొంచి ఉందనే వార్తలు వినిపిస్తున్నాయ్. అలా జరిగితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ చేరుకుంది. సీరం రూపొందించిన కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లు కరోనాను ఎదుర్కోవడంలో సమర్థంగా పనిచేస్తాయని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ రెండు టీకాల‌ను దేశ వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ప్ర‌త్వం చ‌ర్యలు చేప‌ట్టింది. 

మరోవైపు...కొవిడ్ వ్యాక్సిన్ దొంగ‌త‌నం జ‌ర‌గ‌కుండా ఆ టీకాను త‌ర‌లిస్తున్న లాజిస్టిక్స్‌, ట్రాన్స్‌పోర్టు సంస్థలు ప‌క‌డ్బందీ చ‌ర్యలు తీసుకుంటున్నాయ్. ఆ వాహ‌నాలు ఎక్కడికి వెళ్తున్నాయ‌నే అంశాన్ని ఎప్పటిక‌ప్పుడు జీపీఎస్ ద్వారా తెలుసుకునే విధంగా సాంకేతిక‌త‌ను ఉప‌యోగించారు. ఆ ట్రక్కులు ఓపెన్ కాకుండా ఉండేలా రూపొందించారు. ఆన్‌లైన్ విధానంలో రిమోట్ ద్వారా తెరిచే విధంగా చ‌ర్యలు తీసుకున్నారు. ఇంఛార్జిల ఫింగ‌ర్ ప్రింట్‌తోనే ఈ ట్రక్కులు ఓపెన్ అవుతాయ్. క‌రోనా టీకా నిల్వ, వ్యాక్సిన్ వేసే ప్రాంతాల్లో ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

కొవిడ్ వ్యాక్సిన్‌కు జడ్‌ప్లస్ సెక్యూరిటీని కల్పించారు. దేశంలో వీఐపీలు..వీవీఐపీలకు మాత్రమే జడ్‌ప్లస్‌ సెక్యూరిటీ ఉంటుంది. అంతటి భద్రతను కొవిడ్ వ్యాక్సిన్‌కు కల్పించారు. ఈ కేటగిరీలో 36 మంది అధికారులు వీవీఐపీలకు నిరంతరం రక్షణ ఇస్తారు. వీరిలో 10 మందికి పైగా ఎన్‌ఎస్‌జీ అధికారులే ఉంటారు. ప్రస్తుతం దేశంలో ప్రధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌, నితిన్ గ‌డ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, మాజీ సీఎం మాయావ‌తి, అజిత్ దోవ‌ల్‌, గులాం న‌బీ ఆజాద్‌ తో పాటు ప‌లువురు ప్రముఖుల‌కు జ‌డ్ ప్లస్ కేట‌గిరి భ‌ద్రత కేటాయించారు. 

భారత్‌లో వీఐపీలు, వీవీఐపీల కోసం వివిధ రకాల భద్రతా వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. నాయకులకు వారి ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు ఆధారంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సమాచారాన్ని తీసుకుని భద్రత కల్పిస్తారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, రీసెర్చ్ అండ్  అనాలసిస్ వింగ్ విభాగం నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఏ నాయకులకు ఏ  భద్రత కల్పించాలో కేంద్ర హోంశాఖ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సిన్‌కు కూడా జడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రతను కల్పిస్తున్నారు.