మొతేరా పిచ్ పై విమర్శల వర్షం...

మొతేరా పిచ్ పై విమర్శల వర్షం...

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం... తొలిసారి పింక్‌ బాల్‌ టెస్ట్‌... ఇన్ని ప్రత్యేకతలున్న మూడో టెస్టు.. మొదట్నుంచీ వివాదాలతో సాగుతోంది. 

ఇంగ్లండ్‌, టీమిండియా మధ్య జరిగిన మూడో టెస్టు కారణంగా... మొతేరా స్టేడియం పేరు మార్మోగింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ స్టేడియాన్ని.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించగా... ఇక్కడ జరిగిన  మ్యాచ్‌లో గ్రాండ్‌ విక్టరీ కొట్టింది టీమిండియా. అంతేకాదు, పింక్ బాల్‌తో ఆడిన ఈ డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌.. కేవలం రెడ్రోజుల్లోనే ముగియడం కొత్త వివాదానికి దారి తీసింది. ఈ పిచ్‌ ఐదు రోజులకు పనికి రాదనే విమర్శలు వెల్లువెత్తాయి.

చాలామంది మాజీలు  కూడా పిచ్‌ బాగాలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పిచ్‌ స్వభావంపై.. తన దైన శైలిలో స్పందించిన ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌... నిజాయితీగా చెప్పాలంటే ఇది 5 రోజుల టెస్టు పిచ్‌ కాదంటూ సెటైర్లు వేశాడు. చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టు జరిగిన చెపాక్‌ పిచ్‌పైనా.. మైకేల్‌ వాన్‌ ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. పిచ్‌ షాక్‌కు గురిచేసిందనీ... టీమిండియా చాలా మెరుగ్గా ఆడిందనీ చెప్పాడు. అయితే, ఇది 5 రోజుల టెస్టు మ్యాచ్‌ కోసం తయారుచేసిన పిచ్‌ మాత్రం కాదని కామెంట్‌ చేసాడు.

సిక్సర్ల రారాజు యువరాజ్‌ సింగ్‌ కూడా మొతేరా పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ రెండ్రోజుల్లో ముగియడం.. టెస్ట్‌ క్రికెట్‌కు మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి వికెట్‌పై బౌలింగ్‌ చేసి ఉంటే... హర్భజన్‌, అనిల్‌ కుంబ్లేలు... వెయ్యికి పైగా వికెట్లు తీసి ఉండేవారని చెప్పాడు యూవీ. ఈ తరహా పిచ్‌లు తయారు చేయడం కరెక్టు కాదన్నాడు. మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.