బెజవాడపై వైసీపీ స్పెషల్ ఫోకస్..! స్కెచ్ @ 40..!

బెజవాడపై వైసీపీ స్పెషల్ ఫోకస్..! స్కెచ్ @ 40..!

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతోన్న వేళ... బెజవాడ కార్పొరేషన్ లో జెండా ఎగురవేయటానికి వైసీపీ పకడ్బందీ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో మంత్రులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. నగరంలో కీలక ప్రాంతాల్లో మంత్రులు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. 64 డివిజన్లలో 40 డివిజన్ల పైగా గెలవాల్సిందే అని స్కెచ్‌ వేస్తున్నారు. గత ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 59 డివిజన్లలో 38 టీడీపీ గెలుచుకుంటే, వైసీపీ 19 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు మరో ఐదు స్థానాలు పెరిగి విజయవాడ కార్పోరేషన్‌ లో 64 డివిజన్లు ఏర్పడ్డాయి. ఈ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనైనా, 40కి పైగా డివిజన్లలో గెలవాలనే పట్టుదలతో వైసీపీ నాయకత్వం ఉంది. దీనితో మంత్రులతోపాటు కీలక నేతలు కూడా ప్రచారంలో మ మొహరించారు.

జిల్లా మంత్రి కొడాలి నాని బెజవాడ కార్పొరేషన్ ఎన్నికలకు వైసీపీ ఇన్ చార్జ్‌ గా ఇప్పటికే రంగంలోకి దిగారు. బెజవాడలో ఉన్న మూడు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి ప్రచారంతోపాటు టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ప్రచారం, బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు మంత్రి నాని. ఇక మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు. దీనితో డిప్యూటీ సీఎం అంజద్ బాషా రంగంలోకి దిగి మైనార్టీలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇక ఇక్కడ కాపుల ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో ఆ సామాజికవర్గానికి చెందిన మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో బెజవాడ తూర్పులో9, పశ్చిమలో7, సెంట్రల్ లో 3 డివిజన్లను మాత్రమే వైసీపీ గెలిచింది. దీంతో ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో 12 సీట్లకు పైన గెలిస్తే తప్ప మేయర్ సీటు దక్కని పరిస్థితి ఉంది. మూడు నియోజకవర్గాల్లో రెండు చోట్ల మాత్రమే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా తూర్పులో దేవినేని అవినాష్ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ అవినాష్ తోపాటు డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రచారం చేశారు. చివరి రెండు రోజుల్లో జిల్లా ఇంఛార్జి మంత్రి పెద్దిరెడ్డి, పార్టీ జిల్లా ఇంఛార్జి ఎంపీ మోపిదేవి వెంకట రమణ రోడ్ షో నిర్వహించటానికి షెడ్యూల్ ఖరారైందని సమాచారం. పార్టీ అధిష్టానం కూడా బెజవాడ కార్పొరేషన్ లో అభ్యర్థుల పరిస్థితి, ప్రచారం తీరు, గెలిచే అవకాశాలపై ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుని మానిటరింగ్ చేస్తోందని తెలుస్తోంది.