రాజ‌ధాని శంకుస్థాప‌న వాయిదా..! వైసీపీ రెబ‌ల్ ఎంపీ సంతోషం...!

రాజ‌ధాని శంకుస్థాప‌న వాయిదా..! వైసీపీ రెబ‌ల్ ఎంపీ సంతోషం...!

ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖలో ఈనెల 16 వ తేదీన మొదట శంకుస్థాపన చేయాలని భావించినా... ఆ కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది.. దసరా సమయంలో శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకుంది స‌ర్కార్.. దీనిపై స్పందించిన వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు... ఆగస్టు 16న జరుగుతుంది అనుకున్న రాజధాని తరలింపు,. దసరాకు వాయిదా వేస్తున్నట్టు తెలిసింది... ఇది సంతోష‌క‌ర‌మైన వార్త‌ అన్నారు.. అమరావతి రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం తేలికగా ఉల్లంఘించలేదని న్యాయ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నార‌న్నారు. తెలంగాణ ప్రభుత్వ మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి కూడా ఈ విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పార‌న్నారు.. న్యాయం రైతుల పక్షాన ఉంది.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌న్నారు ర‌ఘురామ‌కృష్ణంరాజు. విభజన చట్టంలోని సెక్షన్ 6లో పేర్కొన్నట్లు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సూచించిన మేరకు ఒకే రాజధాని ఉండాల‌న్నారు. కేవలం రైతులకే కాదు,  అమరావతిలోని ఉద్యోగులు సైతం రాజధాని మార్చవద్దని కోరుతున్నార‌ని వ్యాఖ్యానించిన ఆయ‌న‌.. వారి విన్నపాలను మ‌న్నించాల్సిందిగా ముఖ్యమంత్రికి సూచించారు. 

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇటు అమరావతి అటు విశాఖవాసులు ఇద్దరు కూడా ఇబ్బంది ప‌డుతున్నార‌న్నారు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు.. బీజేపీ నేత రామ్ మాధవ్ చెప్పినట్టు 80 మంది ఎంపీలున్న యూపీకి ఓకే రాజధాని ఉండగా ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఎందుకు..? అని ప్ర‌శ్నించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు సందర్భంలో కూడా విభజన చట్టం ప్రకారమే హైకోర్టు విభజన నిర్ణయం జరిగిందని రాష్ట్రపతి ఉత్తర్వులు స్పష్టంగా చెబుతున్నాయ‌ని గుర్తు చేసిన ఆయ‌న‌.. రాజధాని తరలింపు నిర్ణయాన్ని విజయదశమికి వాయిదా వేయడం సంతోషక‌ర‌మైన‌ నిర్ణయం అన్నారు. ఇప్పటికైనా ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవాలి.. రైతుల గుండెలు ఆగిపోయే నిర్ణయాలు తీసుకోకండి అంటూ వైసీపీ ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు చేశారు. రాజధాని విషయంలో విభజన చట్టం ప్రకారమే ఏ నిర్ణయమైనా జరగాలి... దానికి రఘురామకృష్ణంరాజు, సోము వీర్రాజు, రామ్ మాధవ్, జగన్ ఇలా.. ఎవ్వ‌రూ దానికి అతీతులు కాద‌న్నారు.