అమరావతి రైతులకు శుభవార్త..! వంద‌శాతం అమరావతే రాజ‌ధాని..!

అమరావతి రైతులకు శుభవార్త..! వంద‌శాతం అమరావతే రాజ‌ధాని..!

వంద‌శాతం రాజ‌ధాని అమ‌రావ‌తిలోనే ఉంటుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘు రామకృష్ణంరాజు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు రాలేద‌ని గుర్తుచేశారు. అమరావతి రైతులకు శుభవార్త.. రేపు రాష్ట్ర హైకోర్టు దీనిపై తీర్పు వెల్ల‌డించ‌నుంద‌న్న ఆయ‌న‌.. ఇక‌, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌న్నారు. రాజ్యాంగం రైతులకు అనుకూలంగా ఉంది.. రైతుల వైపు న్యాయం ఉంటుంది.. అమరావతి రైతులు ధైర్యంగా ఉండాల‌ని సూచించారు. అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుంటే మాట్లడడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతీఒక్కరి భాధ్యత అన్నారు వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. రాష్ట్రానికి అమరావతి మాత్రమే వందశాతం రాజధానిగా ఉంటుందనే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. 

ఇక‌, గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి.. వైఎస్సార్ పార్టీ రుణం తీర్చుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన భాధ్యత మరిచి నా పై పిచ్చి ప్రకటనలు చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు.. దేవేంద్ర రెడ్డి తను ప్రేమించే వాళ్లకంటే నేను అందంగా ఉండడం తట్టుకోలేక పిచ్చి ప్రకటనలు చేస్తున్నార‌ని.. “రాజుగారి విగ్గు” ఊడినట్లేనా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు.. దేశంలో ఉన్న పదవులన్ని విజయసాయిరెడ్డికే కావాలంటూ సెటైర్లు వేసిన‌ రామ‌కృష్ణంరాజు... పార్టీకి ప్రభుత్వానికి తేడా ఉందా? లేదా సీఎం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో అన్ని పదవులు రెడ్డి కులస్తులేకేనా? అని ప్రశ్నించిన ఆయ‌న‌.. ఛైర్మన్ పోస్ట్ రెడ్డి కులస్తులకు, ప్యూన్ పోస్ట్ ఎస్సీకో, బీసీకో ఇస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక‌, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి రేటు మైనస్ స్థాయికి పడిపోవడం ఆందోళనకరం అన్నారు.