రఘురామకృష్ణంరాజుపై వేటుకు వేళాయే..? రేపే స్పీక‌ర్‌కు ఫిర్యాదు

రఘురామకృష్ణంరాజుపై వేటుకు వేళాయే..? రేపే స్పీక‌ర్‌కు ఫిర్యాదు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేటు వేస్తుందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.. ఆయ‌న మీడియాకు ఎక్క‌డం.. పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు పొంత‌న‌లేని స‌మాధానాలు ఇవ్వ‌డం.. దాంట్లో టెక్నిక‌ల్ పాయింట్లు వెత‌క‌డం.. ఇక‌, నాకు వైసీపీ నేత‌ల నుంచే ప్రాణ‌హాని ఉందంటూ.. లోక్‌స‌భ స్పీక‌ర్, కేంద్ర‌హోంశాఖ‌కు లేఖ‌లు రాయ‌డం.. ఒక్క‌టేంటి.. ఈ ఎపిసోడ్ ఎన్నో మ‌లుపులు తిరుగుతూ వ‌చ్చింది.. మొత్తానికి ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న వైసీపీ అధిష్టానం.. ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.. దీనిలో భాగంగా.. హ‌స్తిన‌కు వెళ్ల‌నున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. లోక్‌స‌భ స్పీక‌ర్‌ను క‌లిసి ఫిర్యాదు చేయ‌నున్నారు.

రేపు మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లాతో స‌మావేశం కానుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం.. పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి, ఎంపీలు నందిగం సురేష్,  శ్రీకృష్ణదేవరాయలు త‌దిత‌రులు స్పీక‌ర్‌తో భేటీకానున్నారు. న‌ర‌సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై స్పీకర్ కు ఫిర్యాదు చేయ‌నున్నారు ఎంపీలు.. వైసీపీ నుంచి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ర‌ఘురామ‌కృష్ణంరాజు.. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతుండ‌డంతో.. ఆయ‌న‌ను అన‌ర్హునిగా ప్ర‌క‌టించాల‌ని కోర‌నున్నారు. కాగా, త‌న‌పై వైసీపీ చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఖాయ‌మ‌ని.. కాక‌పోతే పార్టీ నుంచి స‌స్పెండ్  చేస్తారేమోన‌ని త‌న ముఖ్యఅనుచ‌రుల‌తో ర‌ఘురామ‌కృష్ణంరాజు చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది.. కానీ, ఆయ‌న‌కు వైసీపీ షాక్ ఇస్తూ.. అన‌ర్హ‌త వేటు వేయ‌డానికి సిద్ధం అవుతోంది.