వచ్చే మహానాడుకు టీడీపీ అధికారంలో ఉండదు..

వచ్చే మహానాడుకు టీడీపీ అధికారంలో ఉండదు..

చెరువులలో మట్టి, కాలువలలో బుసుక తిని టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంతోషంగా ఉన్నారని వైకాపా నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు మహానాడు వేదికపై ఒక్కటి కూడా నిజం మాట్లాడలేదని తెలిపారు. అమెరికాలో జరిగిన మహానాడును అక్కడి తెలుగు ప్రజలు అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. మహానాడు త్యాగాలు చేసిన కార్యకర్తలకు నమస్కారంతో సరిపెట్టుకుందని తెలిపారు. అలాగే ప్రతిపక్షం నుంచి వచ్చిన ఎంఎల్ఏలకు మంత్రి పదవులు కట్ట పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆయన విమర్శించారు.

2014లోనే తాము బీజేపీతో కలిసి పనిచేయలేమని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. మేం బీజేపీతో కలవమని తెలిపిన తర్వాతనే టీడీపీతో పొత్తు పెట్టుకుందని వివరించారు. అలాంటంది ఇప్పుడు బీజేపీతో వైసీపీ కలిసిపోతోందని అసత్యాలు ప్రచారం చేయడం ఎంతవరకు సబబని అంబటి రాంబాబు తీవ్రంగా దుయ్యబట్టారు. చంద్రబాబు ఎప్పుడూ ఎదుటివారి బలహీనతలను ఆసరాగా చేసుకొని రాజకీయాలు చేస్తుంటారని మండిపడ్డారు. దివాకర్ రెడ్డి వంటి విలువలు లేని నాయకులు టీడీపీలో ఉన్నారని... వచ్చే మహానాడుకు టీడీపీ అధికారంలో ఉండదని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని దాచుకోవడానికి.. దోచుకోవడానికే ఉపయోగిస్తున్నారని అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు.