జగన్‌తో శివకుమార్ భేటీ.. ఇది శుభదినం..!

జగన్‌తో శివకుమార్ భేటీ.. ఇది శుభదినం..!

హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... ఈ రోజు ఒక శుభదినంగా అభివర్ణించారు... వైసీపీ స్థాపించి తొమ్మిదిన్నర సంవత్సరాలు పూర్తయ్యిందని... పార్టీ కోసం అంకిత భావంతో పని చేసినా.. కొన్ని కారణాలతో పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు శివకుమార్. 3 నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని.. వైఎస్ జగన్ పెద్ద మనసు చేసుకుని నన్ను తిరిగి స్వాగతించారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు సంక్షోభంలో ఉన్నాయన్న శివకుమార్... ఎన్నికల ప్రకటన సమయంలో పార్టీ లైన్ వేరేలా ఉంది.. నా లైన్ వేరేలా ఉంది.. దాంతో పార్టీ నుండి నన్ను తొలగించారని వివరణ ఇచ్చారు. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నిర్ణయించేది జగన్‌మోహన్ రెడ్డియేనన్న శివకుమార్... పార్టీ అధినేత వైఎస్ జగన్ తో అన్ని విషయాలు కూలంకశంగా మాట్లాడానని.. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని జీర్ణించుకోలేక టీడీపీ అనేక అక్రమాలు చేస్తోందని ఆరోపించిన శివకుమార్... టీడీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక చొరవ తీసుకుని నాపై బహిష్కరణకు ఎత్తివేసినందుకు వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుకున్న శివకుమార్.. పార్టీ అధిష్టానంతో చర్చించి వేసిన పిటిషన్ వెనక్కి తీసుకునే దిశగా ముందుకు వెళ్తానని వెల్లడించారు.